Begin typing your search above and press return to search.

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   10 May 2017 8:48 AM GMT
ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (ఎఫ్‌ బీఐ) డైరెక్ట‌ర్ జేమ్స్ కామీపైనే వేటేశారు. ఈమెయిల్ స్కామ్‌లో హిల్ల‌రీపై కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌ను ప‌ద‌విలో నుంచి త‌ప్పించిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఒబామా ప్ర‌భుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హిల్ల‌రీ ప్రైవేట్ ఈమెయిల్ స‌ర్వ‌ర్‌ ను వాడ‌టంపై ఎఫ్‌ బీఐ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ విచార‌ణ జ‌రుపుతున్న తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. గ‌తంలోనే హిల్లరీపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డాన్ని ట్రంప్ త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడు ఏకంగా కామీని త‌ప్పించి ఎఫ్‌ బీఐ మెడ‌లు వంచే ప్ర‌య‌త్నం చేయ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. అయితే ట్రంప్ నిర్ణ‌యం వెనుక ఎలాంటి రాజ‌కీయ దురుద్దేశం లేద‌ని వైట్‌ హౌజ్ స్ప‌ష్టంచేసింది.

కాగా, కామీని తొల‌గించి చాలా పెద్ద త‌ప్పు చేస్తున్నార‌ని తాను ట్రంప్‌ తో అన్న‌ట్లు సెనేట్ డెమొక్ర‌టిక్ నేత చ‌క్ షూమెర్ వెల్ల‌డించారు. అయితే దీనికి ట్రంప్ స‌మాధానం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న అన్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా పాత్ర‌పై స్వ‌తంత్ర విచార‌ణ జ‌రిపిస్తేనే మ‌ళ్లీ అమెరికా ప్ర‌జ‌ల విశ్వాసం చూర‌గొంటామ‌ని షూమెర్ చెప్పారు. అటు సెనేట్ ఇంటెలిజెన్స్ క‌మిటీ రిప‌బ్లిక‌న్ చైర్మ‌న్‌ - సెనేట‌ర్ రిచ‌ర్డ్ బ‌ర్ కూడా ట్రంప్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టే వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌యంలో కామీని తొల‌గించ‌డం త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. ఆయ‌న‌ను తొల‌గించ‌డం ఎఫ్‌బీఐకే కాదు దేశానికే న‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు.

కామీని తొల‌గిస్తున్న‌ట్లుగా ట్రంప్ పంపిన లేఖ‌ను వైట్‌ హౌజ్ రిలీజ్ చేసింది. ఎఫ్‌ బీఐకి కొత్త చీఫ్‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. దీనివ‌ల్ల ఏజెన్సీపై ప్ర‌జ‌ల్లో స‌డ‌లిన న‌మ్మ‌కాన్ని మ‌రోసారి పున‌రుద్ధ‌రించాల్సిన బాధ్య‌త నాపై ఉంది అని ట్రంప్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అటార్నీ జ‌న‌ర‌ల్ జెఫ్ సెష‌న్స్ సిఫార‌సు మేర‌కే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. వాస్త‌వానికి కామీ 2023 వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగాల్సి ఉంది. 2013లో ఒబామా.. కామీని ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్‌ గా నియ‌మించారు.