Begin typing your search above and press return to search.

ట్రంప్‌ పై ఒబామా, ఎఫ్‌ బీఐ మండిప‌డ్డాయి

By:  Tupaki Desk   |   6 March 2017 4:51 PM GMT
ట్రంప్‌ పై ఒబామా, ఎఫ్‌ బీఐ మండిప‌డ్డాయి
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హార శైలిపై ఆ దేశంలోనే తీవ్రం అసంతృప్తులు వెల్ల‌గ‌క్కుతున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న ఫోన్ ట్యాపింగ్ చేయించార‌ని ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌ లో ట్రంప్ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఎఫ్‌ బీఐ డైర‌క్ట‌ర్ జేమ్స్ కోమే కొట్టిపారేశారు. ప్రెసిడెంట్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌బ్లిక్‌గా తిర‌స్క‌రించాల‌ని ఎఫ్‌ బీఐ డైర‌క్ట‌ర్ అమెరికా న్యాయ‌శాఖ‌ను కోరారు. ప్రెసిడెంట్ చేసిన ఆరోప‌ణ‌లు నేరుగా ఎఫ్‌ బీఐని త‌ప్పుప‌డుతున్నాయ‌ని కోమే అన్నారు. ట్రంప్ ఆరోప‌ణ‌ల‌ను సమర్థించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు లేవ‌ని ఎఫ్‌ బీఐ డైరక్ట‌ర్ తెలిపారు.

మ‌రోవైపు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన ఫోన్‌ ను ట్యాపింగ్‌ చేశారంటూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ఆరోపణలను అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఖండించారు. ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఒబామా తరపు ప్రతినిధి కెవిన్‌ లూయిస్‌ మీడియాకు చెప్పారు. ట్రంప్‌ తన ప్రమాణ స్వీకారానికి ముందు ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసిన వరుస ట్వీట్లలో ఒబామాపై ఈ ఆరోపణలు చేశారు. అయితే అందులో ఆయన తన ఆరోపణలకు ఆధారాలను ప్రస్తావించలేదు. లూయిస్‌ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ఒబామా కానీ, వైట్‌ హౌస్‌ లోని మరే ఇతర అధికారి కానీ అమెరికన్‌ పౌరులపై నిఘాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఇందుకు సంబంధించి వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/