Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఓటమి కి బీజేపీ గెలుపునకు అదే తేడా?

By:  Tupaki Desk   |   8 Jan 2020 10:03 AM GMT
టీఆర్ఎస్ ఓటమి కి బీజేపీ గెలుపునకు అదే తేడా?
X
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈరోజు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 22న ఎన్నికలు.. అంతా 14 రోజుల్లోనే కథ ముగియబోతోంది. ఈ నేపథ్యం లో తెలంగాణ లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి తిరుగులేదని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీలో ఓవర్ లోడే ఇప్పుడు పెనుశాపంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

కారు పార్టీలోకి వలసవచ్చిన నేతలతో పూర్తిగా నిండిపోయింది.. ఓవర్ లోడ్ అయిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి గెలిచిన వారు, ఓడిన నేతలు అందరూ వచ్చి కారు ఎక్కేశారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఆది నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వారు తమకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వలస వచ్చిన నేతలు లేదు తమకేనంటూ డబ్బులు వెదజల్లుతున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ కు ఇప్పుడు రెబల్స్ బెడద పట్టి పీడిస్తోంది.

టీఆర్ఎస్ బలాన్నే ఇప్పుడు తమ బలంగా మలుచుకునేందుకు బీజేపీ పార్టీ రెడీ అయ్యింది. బీజేపీలో ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్లు దక్కని బలమైన రెబల్స్ ను పార్టీలోకి లాగి టికెట్లు ఇవ్వడానికి బీజేపీ రెడీ అయ్యింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లు రహస్య భేటీలు జరిపి బీజేపీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.. గులాబీ పార్టీలోని టికెట్లు దక్కని బలమైన నేతలకే బీజేపీ టికెట్లు ఇచ్చి గెలవాలని ప్లాన్ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

ఇక కాంగ్రెస్ పరిస్థితి మూడు కుమ్ములాటలు.. నాలుగు అంతర్గత కలహాలతో సాగుతోంది. టీఆర్ఎస్ లో టికెట్లు దక్కని వారంతా ఇప్పుడు బీజేపీవైపే చూస్తున్నారు. కుదేలైన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపక పోవడంతో పోటీ తక్కువగా ఉంది. టీఆర్ఎస్, బీజేపీ లో టికెట్ల పోటీ ఉండగా.. ఆదినుంచి కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్న వారు గెలుపుపై అంత ధీమా లేకున్నా.. కొన్ని చోట్ల బలమైన నేతలు ఉన్న వారు పోటీనిస్తున్నారు.

ఇలా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బలమైన టీఆర్ఎస్ లో ఓవర్ లోడ్ అయిపోయి టికెట్ల కేటాయింపు కష్టంగా మారింది. ఇక టీఆర్ఎస్ లో టికెట్లు దక్కని వారికి బీజేపీ కల్పతరువుగా మారింది. గులాబీ పార్టీ బలాన్నే క్యాష్ చేసుకునేందుకు కమల దళం రెడీ అయ్యింది. కాంగ్రెస్ మాత్రం గెలుపుపై ఆశలు పెద్దగా లేకున్నా పోటీకి రెడీ అవుతోంది.