Begin typing your search above and press return to search.

ఎంత హృద‌య విదార‌కం.. తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డి.. చిన్నారుల‌ను విసిరేస్తున్నారే!

By:  Tupaki Desk   |   20 Aug 2021 3:21 AM GMT
ఎంత హృద‌య విదార‌కం.. తాలిబ‌న్ల‌కు భ‌య‌ప‌డి.. చిన్నారుల‌ను విసిరేస్తున్నారే!
X
అత్యంత క‌రడు గ‌ట్టిన ముఠాగా పేరున్న తాలిబ‌న్లు.. ఆఫ్ఘ‌నిస్థాన్ దేశాన్ని త‌మ హ‌స్త‌గ‌తం చేసుకుని నాలుగు రోజులు గ‌డిచిపోయాయి. అయితే.. అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం ఈ నాలుగురోజుల‌ను నాలుగు యుగాలుగా భావిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల కింద‌టి వ‌ర‌కు తాలిబ‌న్ల అరాచ‌క పాల‌న‌ను చ‌విచూసిన అఫ్ఘాన్లు.. ఇప్పుడు వారి చెర నుంచి త‌మ ప్రాణాలను ర‌క్షించుకునేందుకు త‌లోదిక్కుకు పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా వారి చిన్నారుల‌ను ర‌క్షించేందుకు యువ‌తుల‌ను, బాలిక‌ల‌ను తాలిబ‌న్ల చెర‌బ‌డ‌కుండా చూసేందుకు వారు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ ప్ర‌య‌త్నాల్లో అఫ్ఘాన్లు చేస్తున్న సాహ‌సం.. అందరినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. కాబూల్లోని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఇప్పుడు అఫ్థాన్ల‌తో నిండిపోయింది. ఏ విమానం వ‌చ్చినా.. దానిని ప‌ట్టుకుని ఏదో ఒక దేశానికి త‌ర‌లిపోయేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ లోగా.. త‌మ‌ను తాలిబ‌న్లు నిర్బంధించ‌కుండా ఉండేందుకు వారు.. అమెరికా సేన‌లు.. ఉన్న ప్రాంతాల‌కు త‌ర‌లిపోతున్నారు. అయితే.. ఈ ఒత్తిడిని భ‌రించ‌లేక‌.. అమెరికా సేన‌లు.. ఇనుప ముళ్ల కంచెల‌ను అడ్డుపెట్టుకున్నాయి.

అయితే.. అఫ్ఘాన్ మ‌హిళ‌లు మాత్రం ఈ ముళ్ల‌కంచెల‌ను కూడా లెక్క‌చేయ‌కుండా.. త‌మ‌చిన్నారుల‌ను ర‌క్షించండి అంటూ.. సేన‌లు ఉన్న దిక్కుగా త‌మ పిల్ల‌ల‌ను విసిరేస్తున్న దృశ్యాలు ప్ర‌తి ఒక్క‌రినీ కంట త‌డిపెట్టిస్తున్నాయి. ముళ్ల కంచెల‌కు ఆవ‌ల అమెరికా, బ్రిట‌న్ ద‌ళాలు ఉన్నాయి. వీరిని చూస్తున్న పౌరులు.. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద పెట్టున రోదిస్తూ..త‌మ‌ను ర‌క్షించాల‌ని వేడుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ చిన్నారుల‌నైనా రక్షించాలంటూ.. ముళ్ల కంచెల మీదుగా సేన‌లు ఉన్న దిశ‌గా పిల్ల‌ల‌ను విసిరేస్తున్నారు.

ఇదే విష‌యాన్ని బ్రిటిష్ అధికారులు పేర్కొన్నారు. మ‌హిళ‌లు విసిరేస్తున్న చిన్నారుల‌ను ప‌ట్టుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశాలు పంపిన‌ట్టు పేర్కొన్నారు. ``తాలిబ‌న్లు ఎక్క‌డ త‌మ‌ను కొడ‌తారోన‌ని మ‌హిళ‌లు, త‌ల్లులు భీతిల్లుతున్నారు. ఈ క్ర‌మంలో మా చిన్నారుల‌ను ర‌క్షించండి! అంటూ.. వారు త‌మ పిల్ల‌ల‌ను ముళ్ల కంచెల వైపు విసిరేస్తున్నారు. మా సేన‌లు ఆ పిల్ల‌ల‌ను ప‌ట్టుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు`` అని వారు వివ‌రించారు. అయితే.. ఇలా విసురుతున్న క్ర‌మంలో చిన్నారులు ముళ్ల కంచెల‌కు చిక్కుకుపోతున్నారు. వీరిని కాపాడ‌డం ఎవ‌రి త‌ర‌మూ కావ‌డం లేద‌ని అధికారులు వివ‌రించారు.


తాలిబ‌న్లు అఫ్ఘాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న నాటి నుంచి కాబుల్ ఎయిర్ పోర్టులో ఇలాంటి దృశ్యాలు స‌ర్వ‌సాధారణంగా మారాయ‌ని చెబుతున్నారు. త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకు వేల మంది పౌరులు ఎటు ప‌డితే అటు వెళ్తున్నారు. ఒక సంద‌ర్భంలో అమెరికా సేన‌లు జ‌నాల ర‌ద్దీని త‌ట్టుకోలేక .. గాలిలోకి కాల్పులు కూడా జ‌రిపిన ఘ‌ట‌న‌ను వారు గుర్తు చేస్తున్నారు.

తాజాగా విడుద‌లైన కాబూల్ విమానాశ్ర‌యంలోని దృశ్యాల‌కు చెందిన రెండు వీడియోలు ఇక్క‌డి మ‌హిళ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని.. ప్రాణాలు కాపాడాల‌ని.. గేట్లు, బారికేడ్లు.. ఆఖ‌రుకు ముళ్ల కంచెల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా.. ముందుకు దూసుకువ‌స్తున్నారు. వీరంతా.. త‌మ‌ను తాలిబ‌న్ల నుంచి ర‌క్షించాల‌నే ఏకైక పిలుపు తో ముందుకు వ‌స్తుండ‌డంతోసేన‌లు సైతం ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఇదీ.. ఇప్పుడు అఫ్ఘాన్‌లో తాలిబ‌న్లు.. ర‌గిల్చిన ర‌గ‌డ‌గా మారింది. మ‌రి అంత‌ర్జాతీయ స‌మాజం ఏం చేస్తుందో చూడాలి.