Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ మాట‌!..ఈ ప్ర‌భుత్వాల‌తో విసుగొచ్చేసింది!

By:  Tupaki Desk   |   12 Feb 2018 1:06 PM IST
క‌మ‌ల్ మాట‌!..ఈ ప్ర‌భుత్వాల‌తో విసుగొచ్చేసింది!
X
బ‌హుభాషా న‌టుడిగానే కాకుండా విశ్వ‌న‌టుడిగా పేరొందిన త‌మిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ దేశ రాజ‌కీయాల‌పై వ‌రుస‌గా చేస్తున్న వ్యాఖ్య‌లు నిజంగానే పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత అనుకోని ప‌రిణామాల‌తో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... ఇప్ప‌టిదాకా పాలిటిక్స్‌పై త‌న స్ప‌ష్ట‌మైన వైఖ‌రినే ప్ర‌క‌టించ‌లేద‌ని చెప్పాలి. త‌న స‌హ న‌టుడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసే విష‌యంపైనా నాన్చుడు ధోర‌ణితోనే ముందుకు సాగుతున్న క‌మ‌ల్‌... త‌మిళ రాజ‌కీయాల్లో అవినీతి భారీ ఎత్తున పేరుకుపోయింద‌ని, అవినీతిపై పోరే త‌న ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మంటూ మొన్నామ‌ధ్య సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. క‌మ్యూనిస్టు భావాల‌ను పోలిన‌ట్లుగా ప‌లుమార్లు వ్యాఖ్య‌లు చేసిన క‌మ‌ల్‌... సీపీఎం నేత‌ - కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌ తోనూ ప‌లుమార్లు భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్... లెఫ్ట్ బాట ప‌డుతున్నారా? అన్న అనుమానాలు కూడా క‌లిగాయి. అయితే ఆ వెంట‌నే ఆయ‌న చేసిన కామెంట్లు, వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో... అస‌లు ఆయ‌న బాట ఏమిటో కూడా అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక తాజాగా అమెరికాకు వెళ్లిన క‌మ‌ల్‌... అక్క‌డి ప్రతిష్టాత్మ‌క వ‌ర్సిటీ హార్వర్డ్ యూనివ‌ర్సిటీలో కీల‌క ప్ర‌సంగం చేశారు. ఈ ప్ర‌సంగంలో భార‌త రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే క‌ల‌క‌లం రేపుతున్నాయ‌ని చెప్పాలి. దేశంలో ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వాలు క‌నిపించ‌డం లేద‌ని, అస‌లు ప్ర‌భుత్వాల నిష్క్రియాప‌ర‌త్వంతో తాను విసిగి వేసార‌న‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ కార‌ణంగానే మొత్తం వ్య‌వ‌స్థ‌నే తాను మార్చాల‌నుకుంటున్నాన‌ని కూడా క‌మ‌ల్ పేర్కొన్నారు. ఈ నెల 21న తాను రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్నాన‌ని చెప్పిన క‌మ‌ల్‌... ఆ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని త‌మిళ‌నాడులోని ప్ర‌తి జిల్లాలో ఓ గ్రామం చొప్పున ద‌త్త‌త తీసుకోద‌ల‌చిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే తాను త‌మిళ‌నాడు స‌ర్కారుకు ద‌ర‌ఖాస్తు చేశాన‌ని, అయితే ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టిదాకా స్పంద‌న వ‌చ్చిన దాఖ‌లాలే లేవ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ్రామాల ద‌త్త‌త ద్వారా... త‌మిళ‌నాడులోనే కాకుండా మొత్తం దేశంలోనే స‌ద‌రు గ్రామాల‌ను ఆద‌ర్శంగా తీర్చిదిద్దాల‌ని భావిస్తున్నాన‌ని, అంతేకాకుండా ప్ర‌పంచంలోనే వాటిని అత్యుత్త‌మ‌మైన‌విగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాన‌ని క‌మ‌ల్ పేర్కొన్నారు. త‌మిళ‌నాడును ప‌దే ప‌దే వ‌ల్లె వేసిన క‌మ‌ల్‌... త‌మిళ‌నాడులో మార్పు కోస‌మే తాను య‌త్నించ‌డం లేద‌ని, మొత్తం దేశంలోనే మార్పు రావాల‌ని భావిస్తున్నాన‌ని, ఆ దిశ‌గానే ముందుకు సాగుతాన‌ని కూడా చెప్పారు. అయినా ప‌దే ప‌దే త‌మిళ‌నాడు పేరును ఎందుకు చెబుతున్నాన‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించిన క‌మ‌ల్‌... దానిని ఓ పిన్ కోడ్ మాదిరిగానే భావించాల‌ని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా హార్వర్డ్ వ‌ర్సిటీ వేదిక‌గా క‌మ‌ల్ చేసిన ప్ర‌సంగం భార‌తీయ ప‌ల్లెసీమ‌లు ఎంత దుర్భ‌ర స్థితిలో ఉన్నాయ‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింద‌న్న మాట‌. అయితే తాను ఆ ప‌రిస్థితుల‌ను మార్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని చెప్పిన క‌మ‌ల్‌... మ‌రి ఇప్పుడున్న ప్ర‌భుత్వాల‌కు భిన్నంగా, జ‌వాబుదారీగా వ్య‌వ‌హ‌రిస్తారా? లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది.