Begin typing your search above and press return to search.

వింత అనుభూతి.. అంతలోనే వణుకు పుట్టించే వార్త ఇది

By:  Tupaki Desk   |   8 April 2022 3:29 AM GMT
వింత అనుభూతి.. అంతలోనే వణుకు పుట్టించే వార్త ఇది
X
గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరా? అన్నదో పెద్ద చర్చ. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఈ అంశం మీద ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగించేలా ఉంటాయి. ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే కాదు.. మనలాంటి లేదంటే మనకంటే అత్యంత తెలివైన బుద్ధిజీవులు ఉండొచ్చని.. వారి కన్ను భూమి మీద పడితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు.. సీరియల్స్ .. నవలలు వచ్చాయి. ఊహలకు అంతేలేని రీతిలో గ్రహాంతరవాసులకు సంబంధించి సాగే ఈ విషయాల్ని పక్కన పెడితే.. తొలిసారి గ్రహాంతరవాసులకు సంబంధించిన భారీ నివేదిక బయటకు వచ్చింది.

దీనికి మూలం.. కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన డీఐఏ.. అదేనండి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఎజెన్సీ పెద్దాయన లూయిస్ ఎలిజోండో 2017లో తాము చేసిన ఒక ప్రాజెక్టు గురించి నోరు జారారు. ఆ ప్రాజెక్టు మరేదో కాదు.. మనకున్న సాంకేతికతకు మించిన టెక్నాలజీ రోదసీలో ఎవరి వద్దనైనా ఉందా? ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందా? అన్న అంచనా వేసే ప్రాజెక్టుగా దీన్ని చెప్పాలి.

దీంతో.. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ప్రముఖ మీడియా సంస్థ సన్ పత్రిక ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోరింది. అందుకు డీఐఏ వివరాలు ఇచ్చేందుకు ససేమిరా అంది. దీంతో నాలుగేళ్ల పాటు పోరాటం చేసిన సదరు మీడియా సంస్థ చివరకు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నివేదికను సొంతం చేసుకోగలిగింది. 1574 పేజీలు ఉన్న ఈ నివేదికలో గ్రహాంతరవాసుల ఉనికి నిర్దారించటం సంచలనంగా చెప్పాలి.

ఇంతవరకు ఉన్న అంచనాలకు మించి.. నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. వారి ఉనికిని ఇందులో నిర్దారించారు. అంతేకాదు.. షాకింగ్ అంశం ఏమంటే.. ఒక గ్రహాంతరవాసితో మహిళ సెక్సు చేసినట్లుగా నిర్దారించారు. అంతేకాదు.. ఆమె గర్భం దాల్చినట్లుగా కూడా పేర్కొన్నారు.

ఇదే తీరులో మనుషులతో శృంగారం చేసిన ఘటనలు ఐదు నమోదయ్యాయని పేర్కొంటూ అందుకు సాక్ష్యాల్ని కూడా ఇందులో పొందుపర్చారు. గ్రహాంతర వాసులకు సంబంధించి ఇందులో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు ఒకింత ఆసక్తి.. అంతలోనే అయోమయం.. అన్నింటికి మించిన భయాందోళనలు వ్యక్తం కావటం ఖాయం. ఇక.. మనుషుల్ని ఏలియన్స్ అపహరించిన ఉదంతాలు మొత్తం 129 నమోదైనట్లుగా చెబుతున్నారు. వీరు ప్రయాణించేవ్యోమనౌకల కారణంగా మనుషుల వాహనాలు విద్యుదయస్కాంత ప్రభావానికి గురైన ఉదంతాలు 77 వరకు నమోదైనట్లుగా ఇందులో పేర్కొన్నారు.

మరింత షాకింగ్ అంశం ఏమంటే.. గ్రహాంతరవాసుల కారణంగా తాము కాలాన్ని నష్టపోయినట్లుగా 75 మంది చెప్పినట్లుగా ఇందులో పేర్కొన్నారు. మరికొందరికి కాలిన గాయాలు.. కరెంటు షాక్ తగిలిన ఉదంతాలు జరిగాయని పేర్కొన్నారు. ఇంతకూ కాలాన్ని నష్టపోవటం ఏమంటే.. వ్యోమగాములు ప్రయాణించే వాహనాలకు దగ్గరకు వెళ్లినప్పుడు పైలెట్లు ఐదు నిమిషాల సమయం అయినట్లుగా అనిపించటం.. ఆ తర్వాత గడిరాయారాన్ని చూస్తే.. అందులో అరగంట గడిచినట్లుగా ఉంటుందన్న తమ అనుభవాన్ని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ప్రపంచంలో తొలిసారి గ్రహాంతరవాసులు ఉన్నారని.. వారి ఉనికి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ వెల్లడించిన అధికారిక నివేదిక ఇదే అవుతుంది.