Begin typing your search above and press return to search.

కండోమ్ వ్యాఖ్య‌ల‌పై చిక్కుల్లో మ‌హిళా ఐఏఎస్!

By:  Tupaki Desk   |   30 Sep 2022 6:55 AM GMT
కండోమ్ వ్యాఖ్య‌ల‌పై చిక్కుల్లో మ‌హిళా ఐఏఎస్!
X
కొద్ది రోజుల క్రితం బిహార్ రాజ‌ధాని న‌గ‌రం పాట్నాలో ఓ స్కూల్ విద్యార్థినుల‌తో మాట్లాడుతూ మ‌హిళా ఐఏఎస్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. శానిట‌రీ న్యాప్‌కిన్స్‌పై విద్యార్థిని అడిగిన ప్ర‌శ్న‌కు ఐఏఎస్ అధికారిణి హ‌ర్‌జోత్ కౌర్ భ‌మ్రా ఫ్రీగా వ‌స్తే కండోమ్స్ కూడా అడుగుతారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. శానిట‌రీ న్యాప్‌కిన్స్ గురించి విద్యార్థిని అడిగితే.. ఫ్రీగా వ‌స్తే కండోమ్స్ కూడా అడుగుతారంటూ ఐఏఎస్ అధికారిణి అన‌డం ఏమిట‌ని దేశ‌వ్యాప్తంగా ఆమె వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు త‌ప్పుబ‌ట్టారు.

దీనిపై తాజాగా జాతీయ బాల‌ల హక్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ సుమోటాగా విచార‌ణ చేప‌ట్టింది. మ‌రోవైపు వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఐఏఎస్‌ అధికారిణి హర్‌జోత్‌ కౌర్‌ భమ్రా వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు బిహార్ ముఖ్య‌మంత్రి కూడా ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. దీంతో ఐఏఎస్ అధికారిణి హ‌ర్‌జోత్ కౌర్ భ‌మ్రా తీవ్ర చిక్కుల్లో ప‌డ్డారు.

కాగా ఇంత‌కీ హ‌ర్‌జోత్ కౌర్ భ‌మ్రా చేసిన వ్యాఖ్య‌ల విష‌యానికొస్తే.. ప్ర‌స్తుతం ఆమె బిహార్ ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎండీగా ప‌నిచేస్తున్నారు. పాట్నాలో ఓ పాఠ‌శాల‌ల‌ విద్యార్థినుల‌తో నిర్వ‌హించిన‌ 'శశక్త్ భేటీ.. సమృద్ధ్ బిహార్' కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌ర‌య్యారు.

ఈ క్ర‌మంలో ఆమెను ఓ విద్యార్థిని ప్ర‌శ్న‌లు అడిగారు. విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, సైకిళ్లు ఇస్తోంద‌ని.. అలాగే వారికి రూ. 20-30 విలువ చేసే శానిటరీ నాప్‌కిన్స్‌ను ఫ్రీగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నపై హ‌ర్‌జోత్ కౌర్ భ‌మ్రా తీవ్రంగా స్పందించారు. కోరికలకు అంతు ఉండక్కర్లేదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవ్వాళ‌ నాప్‌‌కిన్స్ అడుగుతున్నారని.. ఇవి ఇస్తే.. చివరికి కుటుంబ నియంత్రణ కోసం కండోమ్స్‌ను కూడా ఉచితంగా ఇమ్మంటార‌ని మండిప‌డ్డారు.

కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఐఏఎస్‌ అధికారిణి.. ఇలా విద్యార్థినిపై ప‌రుష వ్యాఖ్య‌ల ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు రేగాయి. ఆమె వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు భ‌గ్గుమ‌న్నారు. హర్‌జోత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. దీంతో ఆమె వ్యాఖ్య‌ల‌పై బిహార్ ప్ర‌భుత్వం, జాతీమ మ‌హిళా క‌మిష‌న్‌, జాతీయ బాల‌ల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ విచార‌ణ‌కు ఆదేశించాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.