Begin typing your search above and press return to search.

ఆడవాళ్ళకి అవి బ్యాన్ చేసిన జపాన్ !

By:  Tupaki Desk   |   11 Nov 2019 8:13 AM GMT
ఆడవాళ్ళకి అవి బ్యాన్ చేసిన జపాన్ !
X
ఈ ఆధునిక ప్రపంచంలో ఆడవారు కూడా మగవారితో పోటీ పడుతున్నారు. మగవారిపై గెలిచి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమితం అని అనేవారు, కానీ , నేడు అదే ఆడవాళ్లు కొన్ని దేశాలని పాలిస్తున్నారు. కొద్దికొద్దిగా ఆడవాళ్లు , మేము మగవారి కంటే ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో కూడా ఆడవాళ్లపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. నవ సమాజాలని నిర్మిస్తున్న ఆడవాళ్లపై ఇప్పటికి కొన్ని దేశాలలో వివక్షత చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళ వస్త్రధారణపై ఇప్పటికీ పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికీ నచ్చినట్టు వారు ఉండే హక్కు ఉన్నప్పటికీ , ఆడవారి హక్కులని కొందరు కాలరాస్తున్నారు.

తాజాగా జపాన్ లోని కొన్ని కంపెనీలు ..అందులో పనిచేసే మహిళలకు ఓ వింత రూల్‌ను పెట్టాయి. అదేమిటంటే .. ఇప్పటినుండి ఆడవాళ్లు కళ్లద్దాలు పెట్టుకొని ఆఫీసుకు రావొద్దని చెప్పారు. దీనికి కారణం అడగ్గా .. కళ్లద్దాలు పెట్టుకున్న మహిళలు సీరియస్‌గా కనిపిస్తారని, వారి అందాన్ని అద్దాలు డామినేట్ చేస్తాయని, మరీ ఇంటిలిజెంట్లుగా కనిపిస్తారని ఇలా వింత వింత సాకులు చెబుతున్నారు. ఇక ఎయిర్‌లైన్‌ సంస్థలైతే భద్రత నేపథ్యంగా వారిని కళ్లద్దాలు ధరించొద్దని చెబుతున్నామంటూ తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై అక్కడి మహిళలు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పిచ్చి కారణాలను చూపించి ఆడవాళ్లను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మహిళలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. #GlassesAreForbidden పేరుతో వారు ఓ ఉద్యమాన్ని నడుపుతున్నారు. గతంలో జపాన్‌లో హైహీల్స్ వేసుకొని జాబ్‌కు రావాలని ఓ రూల్‌ను పెట్టగా.. దానిపై కూడా పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అప్పుడు #KuToo పేరిట మహిళలు తమ నిరసనను తెలిపారు.