Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ వాడకంలో మగవాళ్ల కంటే ముందున్న ఆడవాళ్లు

By:  Tupaki Desk   |   9 May 2022 8:30 AM GMT
ఇంటర్నెట్ వాడకంలో మగవాళ్ల కంటే ముందున్న ఆడవాళ్లు
X
నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయే వరకు ఇంటర్నెట్ లేకుండా మనిషి జీవితం ముందుకు సాగడం లేదు. ఉదయం కళ్లు తెరవగానే మొదట వాట్సాప్ ఓపెన్ చేయాల్సిందే. తర్వాత ఇతర సోషల్ మీడియా సైట్లపై ఓ లుక్ వేస్తారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేంటంటే.. ఇంటర్నెట్ వాడకంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఉన్నారట. జెంట్స్ తో పోలిస్తే లేడీస్ ఎక్కువగా ఆన్ లైన్ లో ఉంటారని తేలింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ఇదే తేల్చి చెప్పింది. 2019 నుండి 2021 మధ్య అధ్యయనం చేసిన ఈ సర్వే.. చాలా విషయాలనే చెప్పింది. ఆడవాళ్లు టీవీలకు అతుక్కు పోతారని, సీరియళ్లు అంటే పడి చస్తారని చాలా మంది అనుకుంటారు. లేడీస్ పేరు ఎత్తగానే చాలా మంది చేసే కామెంట్ ఇది. కానీ ఇది ఏమాత్రం నిజం కాదట. టీవీ వీక్షకుల్లో పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారని సర్వే వెల్లడించింది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... దేశవ్యాప్తంగా ఉన్న సగం కంటే ఎక్కువ మందికి అసలు ఇంటర్నెట్ వాడకం ఎలాగో తెలియదు. మగవారిలో కేవలం 48.8 శాతం మంది మాత్రమే అంతర్జాలాన్ని వాడుతున్నట్లు సర్వే పేర్కొంది. అదే స్త్రీ అయితే చాలా ముందు ఉన్నట్లు తేలింది. వారిలో కేవలం 33.3 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ కు దూరంగా ఉంటున్నారు. అంటే.. 66.7 శాతం మందికి ఇంటర్నెట్ పరిచయం ఉన్నట్లు కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది.

తెలంగాణ లోనూ దాదాపు ఇలాగే ఉంది. పురుషుల్లో 50 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతుంటే, మహిళలు 73.5 శాతం మందికి ఇంటర్నెట్ వాడుతున్నారట. ఛండీగఢ్ లో అయితే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా నమోదైంది. అక్కడ 91.9 శాతం మంది పురుషులు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటే.. మహిళలు మాత్రం 75.2 శాతం మందే అంతర్జాలాన్ని వాడటం లేదు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇంటర్నెట్ వినియోగం లో బీహార్ రాష్ట్రానిదే టాప్ ప్లేస్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలను బీహార్ వెనక్కి నెట్టేసింది. అక్కడ పురుషుల్లో 64.6 శాతం మంది, మహిళల్లో 79.4 శాతం మంది ఇంటర్నెట్ ను విరివిగా వాడుతున్నారు.

టీవీ చూడటం గురించి కూడా ఈ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పింది. టీవీ చూడటం లో మహిళలకన్నా పురుషులే ఎక్కువ. కనీసం వారంలో ఒక్కసారి అయినా టీవీ చూసే వారిలో మహిళలు 53.5 శాతం ఉండగా... పురుషులు 55.9 శాతం మంది ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే 75.1 శాతం మంది మహిళలు వారానికి ఒక సారి టీవీ చూస్తామని చెప్పగా, పురుషులు 75.2 శాతం మంది టీవీ చూస్తామన్నారు.