Begin typing your search above and press return to search.

ఫైబర్ నెట్ విచారణ... టీడీపీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

By:  Tupaki Desk   |   12 July 2021 8:10 AM GMT
ఫైబర్ నెట్ విచారణ... టీడీపీ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో జరిగిన ఫైబర్ నెట్ కుంభకోణంపై సీఐడీ విచారణ మొదలైంది. చంద్రబాబు హయాంలో రాష్ట్రం మొత్తంమీద ఇంటింటికి టీవీ, ఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందించటం కోసమని ఏపి ఫైబర్ నెట్ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. అప్పుడు ఐటి మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫైబర్ నెట్ పనులు జరిగాయి.

అప్పట్లోనే సెట్ టాప్ బాక్సుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వందల్లో దొరికే బాక్సులకు టీడీపీ ప్రభుత్వం సుమారు రు. 4 వేలు పెట్టి కొన్నదని వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వేలు పెట్టి కొనుగోలు చేసిన సెట్ టాప్ బాక్సులు కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. రిపేర్లకు వచ్చిన సెట్ టాప్ బాక్సులను రిపేర్లు చేసేవాళ్ళు లేకపోవటంతో చాలామంది ఫైబర్ నెట్ వ్యవస్ధ నుండి మళ్ళీ కేబుల్ నెట్ వర్క్ కే మారిపోయారు.

సెట్ టాప్ బాక్సులు సహా ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు టెండర్లలో భారీగా కుంభకోణం జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ. వైసీపీ నేతల ఆరోపణల ప్రకారం సుమారు రు. 2 వేల కోట్ల అవినీతి జరిగిందట. వైసీపీ అధికారంలోకి రాగానే ఫైబర్ నెట్ కుంభకోణంపై విచారణ జరిగింది. ఫైబర్ నెట్ ఎండి, ఛైర్మన్ జరిపిన ప్రాధమిక విచారణలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారణైందట.

అందుకనే జరిగిన అవినీతి, కుంభకోణాన్ని మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. మరి ఈ విచారణ జరుగుతుందా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో అవినీతి, కుంభకోణాలు జరిగిందని విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అమరావతి భూకుంభకోణం లాంటి వాటిపై సీఐడీ, ఏసీబీ ఇలా విచారణ మొదలుపెట్టిందో లేదో వెంటనే టీడీపీ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంది. మరి ఫైబర్ నెట్ విచారణ విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.