Begin typing your search above and press return to search.

ఫిడెల్ క్యాస్ట్రో బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్!

By:  Tupaki Desk   |   13 Aug 2016 10:55 AM GMT
ఫిడెల్ క్యాస్ట్రో బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్!
X
ఈ మధ్యకాలంలో సందర్భం ఏదైనా గానీ.. ఇచ్చే బహుమతి మాత్రం పూర్తి భిన్నంగా, ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంటారు స్నేహితులు - అభిమానులు - బందువులు! టెడ్డీ బేర్ లు - పూలు - ఫ్లవర్ బొకేలు - ఫోటో ఫ్రేం లు - కుక్క పిల్లలు సబ్బు బిల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే కాదేదీ బహుమతికి అనర్హం అనే స్థాయిలో డిఫరెంట్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. ఇదే ఆలోచనతో చేశారో లేక తన అభిమాన నాయకుడికి ఎవ్వరూ ఊహించని, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో బహుమతి ఇవ్వాలని భావించారో కానీ.. ఫిడెల్ క్యాస్ట్రో కి ఆయన అభిమాని ఒకరు ప్రత్యేకమైన బహుమతి అందించారు.

క్యూబా మాజీ అధ్యక్షుడు - కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రో 90వ పడిలోకి ప్రవేశించారు. ఈ సమయంలో క్యాస్ట్రొకు ప్రపంచవ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ క్రమంలో హవానాకు చెందిన ఒక సీనియర్ సిగార్ల తయారీదారుడు - తన అభిమాన నాయకుడి కోసం అదిరిపోయే రేంజ్ లో పెద్ద సిగార్ ను సిద్దం చేశాడు. క్యాస్ట్రో 90వ పడిలోకి వచ్చిన సందర్భంగా 90 మీటర్ల పొడవున్న సిగార్ ను బహుమతిగా రెడీ చేశాడు. మరో విషయం ఏమిటంటే... ప్రపంచంలో అతిపొడవైన సిగార్ గా కూడా ఇది రికార్డు నెలకొల్పింది.

సిగార్ నే బహుమతిగా ఈ అభిమాని ఎంచుకోవడంలో అందరికీ తెలిసిన ఒక ప్రత్యేకత ఉంది. ఫిడెల్ కు.. పనామా సిగార్ లతో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పుకోవాలి. ఆయన తన స్నేహితుడు చెగువేరాతో కలిసి పనామా సిగార్ కాల్చుతున్న ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. క్యాస్ట్రోనీ, సిగార్ ని విడివిడిగా చూడలేమని కూడా అభిమానులు చెబుతుంటారు.

కాగా ఓరియెంట్ ఫ్రావిన్స్ లోని బిరాన్ అనే ఊరిలో 1926 - ఆగస్టు 13న ఫిడెల్ క్యాస్ట్రో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు గలీసియా - ఏంజెల్ క్యాస్ట్రో అర్జీజ్. ఈయన పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో. మార్క్సిస్టు - లెనినిస్టు భావాలకు క్యూబన్ జాతీయతను కలగలపి క్యాస్ట్రో స్థాపించిన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ తో క్యాస్ట్రో వెలుగులోకి వచ్చారు. నాటి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని విప్లవోద్యమం ద్వారా కూల్చివేసి, దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో ఫిడెల్ క్యాస్ట్రో ప్రపంచం మొత్తం పరిచయం అయ్యారు.