Begin typing your search above and press return to search.

ఒబామాకు షాక్ ఇచ్చిన క్యాస్ట్రో

By:  Tupaki Desk   |   29 March 2016 6:45 AM GMT
ఒబామాకు షాక్ ఇచ్చిన క్యాస్ట్రో
X
దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి క్యూబాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమాకు క్యూబా మాజీ అధ్యక్షుడు.. విప్లవ యోధుడు అయిన ఫిడెల్ క్యాస్ట్రో గట్టి షాక్ ఇచ్చారు. నిజానికి క్యూబాలో ఒబామా పర్యటనను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఊహించని ఈ మార్పును ప్రపంచమంతా చూసింది... కొందరు వ్యతిరేకించారు... కొందరు హర్షించారు. విప్లవ నేతలు క్యాస్ట్రో సోదరులుమారుతున్న కాలానికి అనుగుణంగా మారారని కొందరు.. ఇలా రకరకాల భాష్యం చెప్పారు. కానీ... తాజాగా 89 ఏళ్ల ఫిడెల్ కాస్ట్రో కామెంట్ విన్నవారుమాత్రం సింహం సింహమే అని అనుకుంటున్నారు. ఒబామా పర్యటనపై తొలిసారిగా స్పందించిన ఫిడెల్ "అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా గుండెపోటు వస్తుంది. క్యూబా రాజకీయాలను ప్రభావితం చేసే ఆలోచన వద్దే వద్దని ఆయనకు నేను సలహా ఇస్తున్నా. మా దేశానికి ఆయన ఇవ్వాలనుకుంటున్న బహుమతులు మాకేమీ అక్కర్లేదు" అని అన్నారు.

2006లో తన సోదరుడు రౌల్ కాస్ట్రోకు పాలనా బాధ్యతలు అప్పగించిన ఫిడెల్ క్యాస్ట్రో అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. క్యూబా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న ఆలోచన వద్దని హితవు పలికిన ఆయన, క్యూబాకు వచ్చిన ఒబామా తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల వారితో సమావేశం కావడాన్ని కూడా తప్పు పట్టారు.