Begin typing your search above and press return to search.

ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో మరో పెను సంచలనం.. జర్మనీకి జపాన్ షాక్

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:11 PM GMT
ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో మరో పెను సంచలనం.. జర్మనీకి జపాన్ షాక్
X
జర్మనీ.. ఫుట్ బాల్ లో మేటి జట్టు.. నాలుగు సార్లు ప్రపంచ విజేత. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెజిల్, అర్జెంటీనా కంటే నిలకడైన జట్టు. ప్రతిసారి ప్రపంచ కప్ ఫేవరెట్ ల జాబితాలో జర్మనీ కచ్చితంగా ఉంటుంది. ఈసారీ అలానే ఉంది. కానీ, అలాంటి జట్టుకు పెద్ద షాక్. బుధవారం జపాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో జర్మనీ 1-2 తేడాతో ఓడిపోయింది. ఇది ఆ జట్టుకు దిమ్మతిరిగే ఫలితమే. ప్రపంచ కప్ లో ఇకపై ముందడుగు వేయాలంటే జర్మనీ చెమటోడ్చక తప్పదు.

అచ్చం సౌదీ-అర్జెంటీనా మ్యాచ్ లాగే

మంగళవారం అర్జెంటీనా-సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ తరహాలోనే బుధవారం జర్మనీ-జపాన్ మ్యాచ్ సాగింది. అనామక జట్టయిన సౌదీ 2-1 ఆధిక్యంతో అర్జెంటీనాను ఓడించగా.. జపాన్ 2-1తో జర్మనీని మట్టికరిపించింది. అర్జెంటీనా రెండుసార్లు విజేత.

లయోనల్ మెస్సీ వంటి సూపర్ స్టార్ కెప్టెన్ వారికున్నాడు. కానీ సౌదీ దూకుడు ముందు ఇవేమీ పనిచేయలేదు. విశేషమేమంటే ఫస్ట్ హాఫ్ లో 1-0తో వెనుకబడి మరీ సౌదీ మ్యాచ్ ను 2-1తో గెలిచింది. ఇప్పుడు కూడా జపాన్ ఫస్ట్ హాఫ్ లో 1-0తో వెనుకబడి మరీ 2-1తో గెలిచింది. రెండు మ్యాచ్ లు ఒకే విధంగా సాగడం.. మాజీ చాంపియన్లకు షాక్ తగలడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.

గ్రూప్ ఈ సంక్లిష్టం.. జర్మనీ కిం కర్తవ్యం?

జర్మనీ, జపాన్, మాజీ చాంపియన్ స్పెయిన్, సంచలనాల కోస్టారికా.. ఇవీ గ్రూప్ ఈ జట్లు. ఇలాంటిచోట జర్మనీ ముందడుగు వేయాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. మరీ ముఖ్యంగా స్పెయిన్ గట్టి ప్రత్యర్థి. కానీ, జపాన్ పై ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు స్పెయిన్ మీద గెలవడం కీలకం. జపాన్ తో కనీసం డ్రా చేసుకున్నా.. తక్కువ నష్టంతో బయటపడేది. కానీ, ఓటమితో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. కోస్టారికా, స్పెయిన్ మీద గెలిస్తే గ్రూప్ లో రెండోస్థానంతో అయినా ముందంజ వేస్తుంది.

2018లోనూ ఇలానే

అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాను 1-0తో ఓడించి 2014 ప్రపంచ కప్ ను గెల్చుకుంది జర్మనీ. అదనపు సమయంలో మారియో గోర్జె చేసిన మెరుపు గోల్ తో జర్మనీ జగజ్జేతగా నిలిచింది. దీంతో రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. కానీ, గ్రూప్ దశలో తొలి మ్యాచ్ లోనే మెక్సికో చేతిలో ఓడింది.

దక్షిణ కొరియా చేతిలోనూ ఓడింది. స్వీడన్ మీద గెలిచినా ఫలితం లేకపోయింది. గ్రూప్ ఎఫ్ లో అట్టడుగు స్థానంతో నాడు నిర్లిప్తంగా ఇంటి బాట పట్టింది. కాగా, జర్మనీ మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టడం 1938 తర్వాత ఇదే తొలిసారి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.