Begin typing your search above and press return to search.

అధిష్ఠానం వింత డెసిషన్..నందికొట్కూరు వైసీపీ రెండు ముక్కలు

By:  Tupaki Desk   |   19 March 2020 2:30 PM GMT
అధిష్ఠానం వింత డెసిషన్..నందికొట్కూరు వైసీపీ రెండు ముక్కలు
X
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. పార్టీ విపక్షంలో ఉన్నంతవరకు దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కొంతమేర విభేదాలున్నా... నేతలంతా కలిసికట్టుగా వ్యవహరించేవారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఉమ్మడిగానే సాగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరహా పరిస్థితులను చక్కదిద్ది... పార్టీ పరంగా నియోజకవర్గాలన్నీ కూడా ఒక్కుమ్మడిగా సాగేలా చూడాల్సిన అధిష్ఠానం... తాను తీసుకున్న ఓ వింత నిర్ణయంతో ఓ నియోజకవర్గం అధికారికంగానే రెండు ముక్కలైపోయింది. పార్టీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ తరహా పరిస్థితి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నందికొట్కూరులో చోటుచేసుకున్న ఈ వింత పరిస్థితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ గా కొనసాగుతోంది. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త బైరెడ్డి రాజశేఖరరెడ్డి సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. 2014లో ఇక్కడి నుంచి ఐజయ్య వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి... ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఫలితంగా 2019లో అర్ధర్ అనే కొత్త నేత ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎన్నికల దాకా అంతా బాగానే ఉన్నా... వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే... బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ వర్గంగా - అర్థర్ మరో వర్గంగా విడిపోయారు. ఇరు వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. ఇలాంటి తరుణంలో కీలక సమయంలో పార్టీకి చేయిచ్చిన ఐజయ్యను పార్టీ అదిష్ఠానం ఇటీవలే తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. ఈ నిర్ణయాన్ని అర్థర్ తీవ్రంగా వ్యతిరేకించగా... బైరెడ్డి మాత్రం స్వాగతించారు.

ఇక్కడి దాకా కూడా పరిస్థితి ఓ మోస్తరు లెవెల్లో బాగానే ఉన్నా... స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి విషమించింది. నియోజకవర్గంలోని జడ్పీటీసీ - ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అర్థర్ - బైరెడ్డి వర్గాలు పంతాలకు పోయాయి. ఫలితంగా పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. అయితే ఇరు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సిన అధిష్ఠానం... వారి మధ్య విభేదాలను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరించింది. ఎమ్మెల్యే అర్థర్ కు రెండు మండలాలను కేటాయించిన అధిష్ఠానం.. మిగిలిన నాలుగు మండలాలను బైరెడ్డి వర్గానికి అప్పగించింది. ఫలితంగా నందికొట్కూరు నియోజకవర్గాన్ని అధిష్ఠానమే రెండు ముక్కలు చేసిందని చెప్పాలి. అసలు ఈ తరహా నిర్ణయంతో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించేందుకు బదులుగా నేతలను సంతృప్తిపరిచే క్రమంలో ఏకంగా నియోజకవర్గాల పార్టీ శాఖలను ముక్కలు చేసేందుకే అధిష్ఠానం ఆసక్తి చూపిస్తున్నట్లుగా సంకేతాలను పంపినట్టైంది.

నియోజకవర్గాల పునర్విభనకు ముందు నందికొట్కూరు జనరల్ నియోజకవర్గంగానే ఉండేది. అయితే పునర్విభజనలో నందికొట్కూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు... ఆత్మకూరు నియోజకవర్గంలోని రెండు నియోజకవర్గాలను కలిపేసి నందికొట్కూరు కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆత్మకూరును రద్దు చేసేసి... అందులోని మిగిలిన మండలాలకు నంద్యాలలోని రెండు మండలాలను కలిపేసి శ్రీశైలం పేరిట కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. మొత్తంగా నందికొట్కూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. ఈ నియోజకవర్గంలో కొత్తగా చేరిన ఆత్మకూరు పరిధిలోని పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో బైరెడ్డి వర్గానికి అసలు పట్టే లేదని చెప్పాలి. పాములపాడు మండలానికే చెందిన అర్థర్ కు ఆ మండలంతో పాటు కొత్తపల్లి మండలాల స్థానిక సంస్థల అభ్యర్థుల ఖరారు బాధ్యతలను అప్పగించిన అధిష్ఠానం... బైరెడ్డికి మంచి పట్టున్న నందికొట్కూరు, పడిగ్యాల, మిడుతూరు, జూపాడు బంగ్లా మండలాలను ఆ వర్గానికి అప్పగించింది.