Begin typing your search above and press return to search.

రాజమండ్రి సిటీ సీటు కోసం టీడీపీ నేతల మధ్య ఫైట్!

By:  Tupaki Desk   |   16 Jun 2022 6:30 AM GMT
రాజమండ్రి సిటీ సీటు కోసం టీడీపీ నేతల మధ్య ఫైట్!
X
ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే టీడీపీ నేతల మధ్య పోరు మొదలైందని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, దివంగత ఎర్రం నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీకే చెందిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ‍్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే చర్చ జరుగుతోంది.

ప్రతి ఎన్నికల సందర‍్భంలో రాజమండ్రి సిటీ నుంచి పోటీచేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త.. వాసు తాజాగా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది.

రాజమహేంద్రవరం జే.కె.గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భవానీ భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఉందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

గోరంట్ల రాజమండ్రి సిటీ నుంచి రూరల్‌కు వెళ్లిపోయిన దగ్గర నుంచి సిటీపై మనసు పారేసుకున్నారని చెబుతున్నారు. పార్టీలో సీనియర్‌ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి ఎమ్మెల్యే గోరంట్ల హైడ్రామా సృష్టించిన సంగతి తెలిసిందే.

సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర‍్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట‍్ల పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్‌ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస‍్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తన తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైందని చర్చించుకుంటున్నారు.