Begin typing your search above and press return to search.

వైరల్: వ్యాక్సిన్ కోసం కొట్టుకుంటున్నారు.. ఇలాగైతే మూడోవేవ్ నే?

By:  Tupaki Desk   |   5 May 2021 3:36 PM GMT
వైరల్: వ్యాక్సిన్ కోసం కొట్టుకుంటున్నారు.. ఇలాగైతే మూడోవేవ్ నే?
X
అన్ని ప్రభుత్వాలే చేయాలి.. ప్రజలు మాత్రం చూస్తూ ఉండాలి. బాధ్యత గల పౌరులుగా ఉందామని ప్రజలకు ఏమాత్రం లేదు. ఉంటే ఇలా కరోనా సెకండ్ వేవ్ వచ్చేదే కాదు.. ఏ ఒక్కరికి భయం, భక్తి, కరోనా సోకుతుందన్న సృహ లేకుండా రాజమండ్రి ట్రెయిన్ కాలేజీలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్ కు 45 ఏళ్లు పైబడిన స్త్రీ పురుషులు పోటెత్తారు.

తోసుకున్నారు.. కొట్టుకున్నారు. వాగ్వాదం చేసుకున్నారు. దగ్గరగా సమూహంగా గుమిగూడి వ్యాక్సిన్ కోసం వరుసలా నానా యాగీ చేశారు. కరోనా వేళ వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలి. కానీ రాజమండ్రిలో వ్యాక్సిన్ కోసం జనాలు ఇలా ఎగబడ్డ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇలా దగ్గరగా తోసుకుంటుంటే కరోనా సోకి ఇంకా దారుణాలకు కారణమవుతుంది. అయినా కూడా ఏ మాత్రం సృహ లేకుండా జనాలు ఎగబడ్డ తీరు విమర్శలకు తావిస్తోంది.

ఆ వీడియో చూస్తేనే ఎంతో భయానకంగా ఉంది. కచ్చితంగా ఆ గుంపుతో కరోనా వ్యాపించేలానే కనిపిస్తోంది. రాజమండ్రి ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత దారుణంగా జనాలు వ్యాక్సిన్ కోసం తోసుకుంటున్న వైనంతో ఇక సామూహిక దూరం, నిబంధనలు గాలిలో కలిసిపోయాయనే చెప్పాలి. ఇలాంటి ప్రజల నిర్లక్ష్యం వల్లే కరోనా మరింత ప్రబలి మరింత మంది ప్రాణాలు తీస్తోంది.

ఇక ఇంత జరుగుతున్న సరిపడా వ్యాక్సిన్లను సరఫరా చేయలేని ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని మనం తప్పు పట్టాల్సిందే. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచినా ఇలా జనాలు ఎగబడేవారు కాదు.. ప్రజల ఆరోగ్యాలకు పక్కన పెట్టేసిన ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలు, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల వల్లే కరోనా తీవ్రత పెరిగిందని ఆడిపోసుకున్నారు.ఈ కరోనా సెకండ్ వేవ్ తో వ్యాక్సిన్ కోసం ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనంగా రాజమండ్రిలో తోసుకుంటున్న ప్రజల వీడియో మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది.

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మరో కరోనా వేవ్ రాకముందే వ్యాక్సిన్ల కొరతను తీర్చి పద్ధతిగా ప్రజలందరికీ పంచి ఇలా దారుణాలు కనపడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారం, అంగబలం ఉన్న వారికి అన్నీ ఇంటికే వస్తాయి..కానీ సామాన్యులకే ఈ ఇబ్బందులు. ఇప్పటికైనా ఒక పద్ధతి ప్రకారం ఏపీలో వ్యాక్సినేషన్ చేస్తే ఇలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉంటాయి.