Begin typing your search above and press return to search.

ఆ మ‌హిళా సీఐపై ఎఫ్ ఐఆర్ క‌ట్టండి.. డీజీపీకి ఆదేశం

By:  Tupaki Desk   |   4 Oct 2022 9:46 AM GMT
ఆ మ‌హిళా సీఐపై ఎఫ్ ఐఆర్ క‌ట్టండి.. డీజీపీకి ఆదేశం
X
వైసీపీ పాల‌న‌లో పోలీసులు చేస్తున్న అతి.. వారి మెడ‌కే చుట్టుకుంటోంది. ఇప్ప‌టికే హైకోర్టునుంచి మొట్టి కాయ‌లు ప‌డుతున్నా. లెక్క‌చేయ‌కుండా.. అధికార పార్టీకి భ‌జ‌న చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న పోలీసులు ఏమాత్రం మార‌డం లేదు. తాజాగా ఏపీలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ తీవ్ర‌స్తాయిలో భ‌గ్గ‌మంది. మ‌హిళా సీఐపై ఎఫ్ ఐఆర్ క‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. లేదంటే తామే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంద‌ని ఏకంగా డీజీపీని  హెచ్చ‌రించింది.

గ‌త వారం శ్రీకాళహస్తిలో ఓ మహిళపై మహిళా పోలీసు సీఐ వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్  సీరియస్ అయింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదుకు స్పందిం చింది. మహిళా పోలీసు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఘటనపై నిర్ధేశిత కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేయాలని పేర్కొంది. బాధిత మహిళకు వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించింది. లేకుంటే నేరుగా తామే రంగంలోకి దిగుతామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఈవివాదం.. రాజ‌కీయంగా కూడా మంట‌లు రేపుతోంది.

ఏం జ‌రిగింది..?

శ్రీకాళహస్తిలో నాలుగు రోజుల క్రితం సీఐ అంజు యాదవ్‌ ఓ మహిళ వద్దకు వెళ్లి ఆమె భర్త ఆచూకీ చెప్పాలంటూ ఆమెపై దురుసుగా ప్రవర్తించి, కాలుతో తన్నటం, చీర, జుట్టుపట్టుకుని లాగుతూ పోలీస్ వాహనంలో ఎక్కించడం.. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది.  దీనిపై స్పందించిన వంగలపూడి అనిత.. ఓ మహిళపట్ల పోలీస్ అధికారి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు.

ఆ లేఖపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలీస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. అలాగే బాధిత మహిళకు సరైన వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు అనితకు కూడా సమాచారం పంపించారు.

శ్రీకాళహస్తి ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు జుగుప్సకరంగా ఉందని  రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు,వైసీపీనాయ‌కురాలు అయిన గజ్జల లక్ష్మి సైతం వ్యాఖ్యానించారు.  రక్షకభటులే నేడు భక్షించే పరిస్థితికి చేరారని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ అన్న ఇంగితజ్ఞానం లేకుండా చిరు వ్యాపారి పట్ల అనుచితంగా వ్యహరించారని ధ్వజమెత్తారు. బాధితురాలి చీర లాగేసి వివస్త్రను చేసి జీపులో తోసి అంజు యాదవ్ దారుణంగా ప్రవర్తించిందని గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక మహిళను బూటు కాలితో తన్నిన చరిత్ర సీఐ మంజు యాదవ్‌దని వ్యాఖ్యానించారు. గతంలోనే అంజు యాదవ్‌ గురించి జిల్లా ఎస్పీకి వివరించానని.. అయినా తీరు మారలేదని గజ్జల లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఐ అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి మహిళా సీఐ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోవాల్సి వస్తుందని గజ్జల లక్ష్మి వ్యాఖ్యానించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.