Begin typing your search above and press return to search.

త‌న పొలిటికల్ ఎంట్రీపై మ‌హేష్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   4 Sep 2018 9:17 AM GMT
త‌న పొలిటికల్ ఎంట్రీపై మ‌హేష్ క్లారిటీ!
X
కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ తాజాగా త‌న మ‌కాం విజ‌య‌వాడ‌కు మార్చిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై తాను విజ‌య‌వాడ‌లో ఉండ‌బోతున్నాన‌ని మ‌హేష్ నిన్న మీడియాకు తెలిపారు. అంత‌కుముందు మ‌హేష్ ...ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌ని, ఓ పార్టీ త‌ర‌ఫున రాయ‌ల‌సీమ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రోసారి మీడియాతో మాట్లాడిన మ‌హేష్ త‌న రాజ‌కీయ ప్ర‌వేశం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. నగర బహిష్కరణతో త‌న‌ వ్యక్తిగత స్వేచ్ఛను హరించార‌ని మ‌హేష్ అభిప్రాయపడ్డారు. ఆ బ‌హిష్క‌ర‌ణ‌తో తాను ఉపాధిని కోల్పోయాన‌ని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు కొందరికి అభ్యంతరకరం కావ‌చ్చ‌ని, కానీ చట్టపరంగా నేరం కాద‌ని అన్నారు. ఒక‌వేళ తాను చేసింది నేరం అని అనుకుంటే కేసు పెట్టి కోర్టులో శిక్ష పడేలా చేయాల‌ని, అపుడు దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు.

గూండా యాక్ట్ ప్రయోగించి త‌న వ‌ల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించార‌ని, ఆ విధంగా త‌న ప్రాథమిక హక్కుకు భంగం క‌లిగించార‌ని అన్నారు. త‌న కేసు కోర్టులో ఉన్న‌పుడే త‌న‌కు శిక్ష పడిపోయిందని, పడిపోయిన శిక్షకు పోలీసులే వివరణ ఇవ్వాలని అన్నారు. హిందూ మ‌తంపై త‌న వ్యాఖ్య‌ల‌ను మ‌హేష్ స‌మ‌ర్థించుకున్నారు. త‌న విమ‌ర్శ‌ల‌తో అంగీకరించ‌డం.. లేదంటే విభేదించ‌డం చేయ‌చ్చ‌ని...బ‌హిష్క‌ర‌ణ విధించ‌డం ఏమిట‌ని అన్నారు. గొడవలకు వెళ్లమనో.. హత్యలు చేయమనో తాను ఎవ‌రినీ ప్రేరేపించలేద‌ని, అలా అన్న వాళ్లను కూడా ఏమీ చేయ‌లేద‌ని అన్నారు. గోవధ పేరుతోనో.. గో రక్షణ పేరుతోనో మనుషులను చంపమని చెబుతున్న వారిని ఏమీ అనడం లేద‌ని తాన‌ అభిప్రాయప‌డ్డాన‌ని, ఆ వ్యాఖ్య‌ల‌ను బేస్ చేసుకొని నగర బహిష్కరణ విధించ‌డం ఏమిటని ప్ర‌శ్నించారు. ఈ గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాక త‌న రాజకీయ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వస్తుంద‌ని అన్నారు. తాను ఏ వైపుకు వెళతానో... ఏం చేయగలుగుతానో త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని అన్నారు.. పొలిటికల్ గా కాన్షియస్‌గా ఉండగలిగిన వాళ్లు, జనాల్ని రిప్రజెంట్ చేయగలిగిన వాళ్ల అవసరం రాజకీయంగా ఉందని అన్నారు.