Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు రోజాకు పదవీ.. జగన్ ఇచ్చింది ఇదే..

By:  Tupaki Desk   |   12 Jun 2019 8:43 AM GMT
ఎట్టకేలకు రోజాకు పదవీ.. జగన్ ఇచ్చింది ఇదే..
X
వైసీపీలో రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో చెలరేగిన అసమ్మతి అంతా ఇంతా కాదు.. చంద్రబాబుతో సై అంటే సై అని కొట్లాడి గడిచి ఐదేళ్లు అష్టకష్టాలు పడ్డ రోజాను జగన్ మంత్రిని చేయలేదన్న బాధ ఆమె అభిమానులు వైసీపీ శ్రేణుల్లో విస్తృతంగా పాకింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా రోజాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండేది అని తాజాగా ట్వీట్ లో కోరారు. దీంతో రోజాపై సానుభూతి వెల్లివిరిసింది.

ఎట్టకేలకు ఈ అంసతృప్తికి తలొగ్గిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రోజాకు కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చైర్ పర్సన్ గా నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రోజాకు ఆ పదవిని ఖరారు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారని..రేపో మాపో ఉత్తర్వులు వెలువడుతాయని సమాచారం.

రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆమె మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొనకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆమె అలకబూనారని వార్తలు వచ్చాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆమెతో ఫోన్లో మాట్లాడి నిన్న రప్పించారు. ఆ తర్వాత జగన్ నేరుగా రోజాతో మాట్లాడారు..

అయితే తనకు పదవీ అక్కర్లేదని పార్టీ కోసం పనిచేస్తానని రోజా చెప్పినట్టు తెలిసింది. చివరకు జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవికి ఎంపిక చేశారని తెలిసింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ తోపాటు ఆర్టీసీ చైర్ పర్సన్ పదవులను ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు ఏపీఐఐసీకే జగన్ మొగ్గు చూపారు.