Begin typing your search above and press return to search.

హమ్మయ్య... ఎట్టకేలకు బబుల్ లేకుండా ఓ సిరీస్

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 AM GMT
హమ్మయ్య... ఎట్టకేలకు బబుల్ లేకుండా ఓ సిరీస్
X
కొవిడ్ పుణ్యమాని రెండేళ్లుగా క్రికెట్ మ్యాచ్ లు ప్రమాదంలో పడ్డాయి. దీంతో వీరాభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక ఆటగాళ్ల పరిస్థితి అయితే చెప్పనవరం లేదు. కొవిడ్ కంటే బయో బబుల్ పైనే ఎక్కువ ఆందోళన చెందారు. కొందరు ఇంగ్లిష్ క్రికెటర్లయితే బయో బబుల్ తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు.

ఇప్పటికీ బబుల్ అంటే బాబోయ్ అంటున్న వారున్నారు. మానసికంగా ఆసియా క్రికెటర్ల అంతటి బలవంతులు కాని మిగతా దేశాల క్రికెటర్లు బయో బబుల్ తో నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సిరీస్ లకు దూరమయ్యారు కూడా. కొందరైతే ఒత్తిడి తట్టుకోలేక బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించారు. అది వేరే సంగతి.

బీసీసీఐ నుంచి ఊరట

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బయో బబుల్‌ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీ్‌సను బయో బబుల్‌ లేకుండా నిర్వహించేందుకు బోర్డు సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. జూన్‌ 9 నుంచి 19 వరకు జరిగే ఈ టీ20 సిరీ్‌సకు ఢిల్లీ, కటక్‌, వైజాగ్‌, రాజ్‌కోట్‌, బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ సిరీ్‌సలు, ఇతర క్రీడలు కూడా బబుల్‌ లేకుండానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు దీని నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని బోర్డు భావిస్తోందని ఓ అధికారి చెప్పాడు. కానీ, కొవిడ్‌ పరీక్షలను మాత్రం ప్రస్తుత తరహాలోనే నిర్వహిస్తారన్నాడు.

బబుల్ అంటే బుడగ కాదు

సహజంగా కొవిడ్ వచ్చిన తొలినాళ్లలో ఎన్ని అపోహలున్నాయో.. బయో బబుల్ పైనా అన్నే అనుమానాలున్నాయి. అసలు బబుల్ అంటే ఒక బుడగలో ఉంచుతారనే అపోహ ఉన్నవారూ ఉన్నారు. కానీ, బయో బబుల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆటగాళ్లందరి కదలికలపై పర్యవేక్షణ. విదేశీ పర్యటనలు, లీగ్ ల సందర్భంగా వారు నిర్దేశిత ప్రాంతానికే పరిమితమయ్యేలా చూస్తారు. ఏడాది కిందట వరకు బయో బబుల్ కఠినంగా అమలయింది. ఇప్పుడు కాస్త మినహాయింపులిచ్చారు.