Begin typing your search above and press return to search.

ఆ రూ.1.25లక్షల కోట్లకు ఇప్పటికి థ్యాంక్స్

By:  Tupaki Desk   |   9 Dec 2015 9:42 AM GMT
ఆ రూ.1.25లక్షల కోట్లకు ఇప్పటికి థ్యాంక్స్
X
కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఆంధ్రులకు ఉత్త చేయి చూపిస్తూ.. తియ్యగా నాలుగు మాటలు చెప్పి.. కాసింత నీళ్లు.. కూసింత మట్టి పెట్టి పోయిన ప్రధాని మోడీ.. బీహార్..కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు వెళితే చాలు.. ఆయన ఒళ్లు పులకరించి పోతుంది. మోడీ నోటి నుంచి భారీ స్థాయిలో ప్యాకేజీలు.. హామీలు వచ్చేస్తుంటాయి.

అదేం దరిద్రమో కానీ.. ఏపీకి వస్తే చాలు.. ఆయన ఆచితూచి వ్యవహరిస్తుంటాడు. మొహమాటం కోసం కూడా నిధుల మాటను తీసుకురారు. అలాంటి మోడీ.. ఆ మధ్యన బీహార్ ఎన్నికలకు ముందు.. ఆ రాష్ట్రానికి రూ.1.25లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటం తెలిసిందే. తాను ప్రకటించే రూ.1.25లక్షల కోట్ల ప్యాకేజీతో బీహారీల మనసు దోచుకోవచ్చని.. తమకు తిరుగులేని అధికారం వస్తుందని కమలనాథులు చాలానే ఆశలు పెట్టుకున్నారు.

ఇందులో భాగంగా ప్యాకేజీ ప్రకటించిన మోడీని.. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ థ్యాంక్స్ చెప్పలేదు కదా.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇలాంటి ప్రకటనలు చేశారంటూ మండిపడ్డారు. ఎన్నికల క్రతువు ముగిసి.. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కు.. నాటి మోడీ మాటలు గుర్తుకు వచ్చాయి.

అధికారం తన చేతిలో ఉన్న నేపథ్యంలో.. నాడు మోడీ ప్రకటించిన రూ.1.25లక్షల కోట్ల ప్యాకేజీని వ్యూహాత్మకంగా గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ అభివృద్ధికి నిధులు కావాలి. అందుకు కేంద్రం సాయం కావాలి. ఢిల్లీకి వెళ్లి ప్రధాని ముందు నిలబడి అడుక్కునే కన్నా.. ఎన్నికల ముందు ప్రధాని హోదాలో మోడీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తే జరగాల్సింది జరుగుతుంది.

అందుకేనేమో.. అప్పుడెప్పుడో ప్యాకేజీ ప్రకటించిన మోడీకి.. తాజాగా నితీశ్ థ్యాంక్స్ చెప్పేశారు. మోడీ ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నామని.. దాన్ని నిబద్ధతతో అమలు చేస్తామని చెప్పారు. తాజాగా నితీశ్ థ్యాంక్స్ కారణంగా.. గతంలో మోడీ ఇచ్చిన రూ.1.25లక్షల కోట్ల హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే సర్కారు మీద పడినట్లే. చూస్తుంటే.. నితీశ్ నోటి నుంచి థ్యాంక్స్ అన్న మాట వస్తే.. దానికి మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుందన్న మాట.