Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు.. చరిత్ర తవ్విన బుగ్గన

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:49 AM GMT
అసెంబ్లీకి 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు.. చరిత్ర తవ్విన బుగ్గన
X
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం ఉప సంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ముందుకు తెచ్చింది. ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని.. అన్ని హైదరాబాద్ లో పెట్టారని చరిత్ర చెప్పారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటిదాకా మొత్తం హైదరాబాద్ లోనే పెట్టేశారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా పరిశ్రమలను పెట్టకుండా హైదరాబాద్ లో పెట్టి అన్యాయం చేశారని బుగ్గన చెప్పుకొచ్చారు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు సర్కార్ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని బుగ్గన గుర్తు చేశారు. ఏ రాష్ట్రాలైనా వెనుకబడిన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. అమరావతి ప్రాంతం సారవంతమైన, ఖరీదైన భూమి ఉందని దీన్ని వృథా చేయవద్దని కూడా కమిటీ చెప్పిందన్నారు. ఈ కమిటీ నివేదికను అసెంబ్లీలో పెట్టకుండానే అప్పటి ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకొన్నారని బుగ్గన తెలిపారు.

ఒక చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ లో కేంద్రప్రభుత్వం అన్ని సంస్థలను అక్కడే పెట్టారని.. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి చేయలేదని మంత్రి తెలిపారు.

అందుకే అనుభవాలు, చారిత్రక ఆధారాలతోనే వికేంద్రీకరణ చేశామని తెలిపారు. ముంబై కంటే రెండింతలు రాజధానిని కడుతామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పుకొచ్చిందని గుర్తు చేశారు. 7500 చ.కి.మీల విస్తీర్ణంతో రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటనను మంత్రి ప్రస్తావించారు. ముంబై నగరం మొత్తం 4300 చ.కి.మీలు మాత్రమే ుందన్నారు. చంద్రబాబు ఊహాజనితంగా రాజధానిని నిర్ణయించారని మంత్రి బుగ్గన.. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రతిపాదించారు.