Begin typing your search above and press return to search.

పంజాబ్‌పై 'ఆప‌రేష‌న్ లోట‌స్‌'.. వెయ్యికోట్లు ఖ‌ర్చు

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:05 AM GMT
పంజాబ్‌పై ఆప‌రేష‌న్ లోట‌స్‌.. వెయ్యికోట్లు ఖ‌ర్చు
X
పంజాబ్లో ఈ ఏడాది కొలువుదీరిన ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆరోపించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలకు రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పారు. త‌మ‌ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా 'ఆపరేషన్ లోటస్' చేపట్టిందని ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా వ్యాఖ్యానించారు. ఇందుకోసం బీజేపీ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధమైందని బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ గతంలో ఇలాంటి ఎత్తుగడలే వేసిందన్నారు. ఇప్పుడు పంజాబ్లో అదే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు యత్నించింద‌ని మంత్రి తెలిపారు.

ఇందులో ఏడుగురిని నేరుగా లేదా మూడో వ్యక్తి ద్వారా సంప్రదించిందన్నారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా శాసనసభ్యులపై ఒత్తిడి తెస్తోందని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందని... ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆఫర్ చేసింద‌ని ఆరోపించారు.

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం విషయంలోనూ బీజేపీపై ఆమ్ఆద్మీ పార్టీ ఇదే తరహా ఆరోపణలు చేసింది. తమ పార్టీలో చీలికలు తెచ్చేందుకు భారతీయ జనతాపార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆప్ నేతలు అన్నారు.

పార్టీలో చీలిక తెచ్చేందుకు 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించినట్లు ఆ పార్టీ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు చొప్పున ఇచ్చి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు యత్నించిందని చెప్పారు.

అయితే ఆ ప్రయత్నాలను తమ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. ఎప్పటికీ తాము ఆమ్‌ ఆద్మీలోనే ఉంటామని వారంతా స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే.. సెప్టెంబర్ 1న శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేజ్రీవాల్ దీనిని దిగ్విజ‌యంగా నెగ్గారు. మ‌రి ఇప్పుడు పంజాబ్‌లోనూ ఇదే త‌ర‌హా విశ్వాస తీర్మానం పెడ‌తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.