Begin typing your search above and press return to search.

విజయవాడ వ్యాపారి హత్యకు ఆర్థిక వివాదాలే కారణం?

By:  Tupaki Desk   |   28 Aug 2021 1:30 AM GMT
విజయవాడ వ్యాపారి హత్యకు ఆర్థిక వివాదాలే కారణం?
X
ఆర్థిక వివాదాలు.. డబ్బుల గొడవలే విజయవాడ వ్యాపారి హత్య కు కారణమని పోలీసులు తేల్చారు. విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. రాహుల్ ను కారులో ఉన్న ఛార్జర్ వైరుతో హత్య చేశారని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. కారు వెనుక సీట్లో కూర్చొని రాహుల్ ను హత్య చేశారని సీపీ తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి సీపీ మీడియాకు వెల్లడించారు.

సీపీ మాట్లాడుతూ 'కోరాడ విజయ్ కుమార్ 1991 నుంచి చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఛాగర్ల గాయత్రి అనే మహిళ ఈ చిట్ ఫండ్ కంపెనీలో భాగస్వామి. ఇక చనిపోయిన వ్యాపారి రాహుల్ కు, కోరాడ విజయ్ కుమార్ కు వ్యాపార సంబంధాలున్నాయి. ఇద్దరూ ఒక కంపెనీలో భాగస్వాములు' అని తెలిపారు.

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో పోటీచేసి కోట్లు ఖర్చు పెట్టిన కోరాడ విజయ్ కుమార్ ఓటమి పాలవడంతో భారీగా నష్టపోయాడని.. అప్పుల వాళ్ల వెంట పడడడంతో ఫ్యాక్టరీ అన్న విక్రయించాలని.. లేదంటే తన వాటా ఇవ్వాలని పార్ట్ నర్ రాహుల్ పై ఒత్తిడి తీసుకొచ్చాడని సీపీ తెలిపారు. డబ్బు ఇవ్వకుండా.. షేర్లు ట్రాన్స్ ఫర్ చేయకుండా రాహుల్ మాట దాటవేస్తూ సతాయించడంతో కోరాడ విజయ్ చాలా సార్లు అడిగి విసిగిపోయాడు. ఇక చేసేదేం లేక 'కోగంటి సత్యం' అనే వ్యక్తి సాయం కోరాడు.

కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ ఒకటి రెండు సార్లు ఈ విషయంలో రాహుల్ ను బెదిరించారు. అప్పటికీ రాహుల్ బెదరకుండా సెటిల్ చేయలేదు. ఈ క్రమంలోనే చాగర్ల గాయత్రి కూతురుకు కూడా ఢిల్లీలో మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్టు సీపీ తెలిపాడు. ఆ సీటును ఇప్పించకుండా.. డబ్బు తిరిగి ఇవ్వలేదని తెలిపాడు.

ఇలా రాహుల్ కోరాడకు, గాయత్రికి డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తుండడంతో రాహుల్ ఆఫీసుకు వెళ్లి కొంతమంది మనుషులు కొట్టి పథకం ప్రకారం కారులో తీసుకెళ్లారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్న అనంతరం కారులోని ముందు సీట్లో కూర్చోబెట్టి చార్జర్ వైర్ తో వెనుక నుంచి మెడకు బిగించి హత్య చేశారని సీపీ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి కోరాడ విజయ్ కుమార్ సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. ఇప్పటివరకు 13 మంది నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.