Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించాలి.. య‌న‌మ‌ల డిమాండ్‌

By:  Tupaki Desk   |   27 March 2022 1:30 AM GMT
రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించాలి.. య‌న‌మ‌ల డిమాండ్‌
X
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రింత ఉద్య‌మం చేయ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో కేంద్రం స్వ‌యంగా జోక్యం చేసుకోవాల‌ని.. టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్ధిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని.. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామ‌కృష్ణుడు కోరారు. రూ.కోటి 78 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడితే రూ.48వేల కోట్లకు లెక్కల్లేవని ఆరోపించారు.

రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాల‌కు రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. రూ.48 వేల కోట్లకు లెక్కల్లేవని య‌న‌మ‌ల ఆరోపణలు చేశారు. లెక్కలు చెప్పలేకపోతే.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందని.. స్పెషల్ బిల్లులనేవి ట్రెజరీ కోడ్‌లోనే లేదని యనమల అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

"ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతుందేం లేదు. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారు. ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోంది. కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సుమారు రూ. లక్ష కోట్లు తెచ్చారు.. దానికి సంబంధించిన లెక్కలు చెప్పలేదు.

ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కలు కూడా బడ్జెట్ లెక్కల్లో చూపాలని 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది. 2024 నాటికి రూ. 8-9 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. " అనియ‌న‌మ‌ల అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ(పీఏసీ) వ్యవస్థ ఎందుకు సరిగా పని చేయడం లేదని యనమల ప్రశ్నించారు. పీఏసీ జరగనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

చట్టాలు చేసే హక్కు చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదన్న యనమల.. మూడు రాజధానులపైనే చట్టం చేసే అధికారం లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు. స్పెషల్ బిల్లుల పేరుతో.. నిధులు మళ్లించేందుకే సీఎఫ్ఎంఎస్ విధానం లోపభూయిష్టమనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.