Begin typing your search above and press return to search.

మెట్రో ఫ‌స్ట్ డే.. చాలామందికి ఫైన్లు ప‌డ్డాయ్‌!

By:  Tupaki Desk   |   30 Nov 2017 4:54 AM GMT
మెట్రో ఫ‌స్ట్ డే.. చాలామందికి ఫైన్లు ప‌డ్డాయ్‌!
X
క‌ల‌ల మెట్రో రైలు అందుబాటులోకి వ‌చ్చేసింది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన మెట్రో రైలు వాస్త‌వ రూపం దాల్చ‌టంతో హైద‌రాబాదీల సంతోషానికి అంతులేదు. మెట్రో రైలును మొద‌టిరోజే ఎక్కాల‌న్న ఆశ‌.. ప్ర‌జ‌ల్ని పెద్ద ఎత్తున మెట్రో స్టేష‌న్ల‌కు వెళ్లేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హైద‌రాబాద్ మెట్రో రైలు అమీర్ పేట మిన‌హా మిగిలిన స్టేష‌న్ల‌లో 40 సెకండ్లు మాత్ర‌మే ఆగుతుంది.

ఈ లోపులే ట్రైన్లోకి ఎక్కటం.. దిగ‌టం జ‌రిగిపోవాలి. ఏ మాత్రం తేడా వ‌చ్చినా త‌ర్వాత స్టేష‌న్లోనే. ఒక్క‌సారి ట్రైన్ త‌లుపులు మూసుకుపోతే ఇక అంతే. అవి త‌ర్వాత స్టేష‌న్లో మాత్ర‌మే తెరుచుకుంటాయి. మెట్రో రైలు ఎలా ప్ర‌యాణిస్తుందో అర్థం కాని న‌గ‌ర‌జీవులు ప‌లువురికి మొద‌టిరోజే జ‌రిమానాలు ప‌డ్డాయి. తాము దిగాల్సిన స్టేష‌న్ వ‌చ్చినా.. దిగ‌టంలో జ‌రిగిన పొర‌పాటుతో వేరే స్టేష‌న్లో దిగేశారు.

ఇలాంటి వారి విష‌యంలో హైద‌రాబాద్ మెట్రో అధికారులు పెద్ద మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రించారు. మామూలుగా అయితే.. టికెట్ తీసుకున్న స్టేష‌న్‌ కు కాకుండా వేరే స్టేష‌న్ లో దిగితే జ‌రిమానా విధించాలి. కానీ.. కొత్త‌గా ఉండ‌టం.. కాస్త క‌న్ఫ్యూజింగ్ ఉండ‌టంతో దిగాల్సిన స్టేషన్ లో కాకుండా ప‌క్క స్టేష‌న్ లో దిగిన వారి విష‌యంలో మెట్రో అధికారులు ఉదారంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌రిమానా జోలికి వెళ్ల‌కుండా.. టికెట్ ఎంత మొత్తం ఉంటుందో అంత మొత్తాన్ని క‌లెక్ట్ చేయ‌టంతో ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

కొన్ని రోజుల పాటు ఇలాంటి విధానాన్నే అమ‌లు చేస్తామ‌ని.. మెట్రో రైలుపై న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఒక‌సారి అవ‌గాహ‌న వచ్చాక జ‌రిమానాల విధానాన్ని తెర మీద‌కు తెస్తామ‌ని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఏమైనా.. ప్ర‌యాణికుల భ‌యాల్ని.. ఇబ్బందుల్ని గుర్తించ‌ట‌మేకాదు.. వారి మ‌న‌సుల్ని నొప్పించ‌కుండా ఉండేలా హైద‌రాబాద్ మెట్రో ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేసింద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.