Begin typing your search above and press return to search.

25వేలిస్తే వేలిముద్ర మారిపోయే సర్జరీలు.. విదేశాలకు వెళ్లే అక్రమ మార్గమిదీ

By:  Tupaki Desk   |   1 Sep 2022 5:41 PM GMT
25వేలిస్తే వేలిముద్ర మారిపోయే సర్జరీలు.. విదేశాలకు వెళ్లే అక్రమ మార్గమిదీ
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోతలా తయారైంది ఈ మోసాల పరిస్థితి. సవాలక్ష దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విదేశాలకు వెళ్లేందుకు క్రైం రేటు కలిగిన నేరగాళ్లు తమ వేలిముద్రలను విమానాశ్రయంలో దొరకకుండా మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో ఒక ముఠా పనిచేస్తుండడం.. తాజాగా పట్టుబడడం కలకలం రేపుతోంది.

గల్ఫ్ సహా ఇతర దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహా మోసాలకు కొందరు పాల్పడుతున్నారు. వేలిముద్రలు రిజెక్ట్ కావడంతో విదేశాలకు వెళ్లలేకపోతున్నవారు వేలిముద్రలు కనపడకుండా కొత్త తరహా సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ అనంతరం దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు.

నేరాల గుర్తింపులో పోలీసులు మొదల సేకరించేది వేలిముద్రలే. ఏదైనా కేసుల్లో ఉన్న వారు విదేశాలకు వెళ్లేందుకు వీలుకాదు. ఒకవేళ తప్పుడు పేర్లతో విదేశాలకు వెళ్లాలన్నా వేలిముద్రలు ఇట్టే పట్టేస్తాయి. అక్రమార్కులు దేశం దాటి వెళ్లిపోవడం సాధ్యం కాదు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఇప్పుడు నయా దందా మొదలైంది.  వేలిముద్రల సర్జరీలు నిర్వహిస్తున్న వారు పోలీసులకు దొరికిపోయారు. శస్త్రచికిత్సల ద్వారా ఆయా వ్యక్తుల వేలిముద్రలను మార్చివేసి వారిని కువైట్ పంపుతున్నట్టు తేలింది. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారు కనీసం 11 వేలిముద్రల మార్పిడి శస్త్రచికిత్సలు చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25వేలు వసూలు చేసినట్టు తేలింది.

కువైట్ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు వ్యక్తులు మళ్లీ కువైట్ వెళ్లేందుకు ఈ వేలిముద్రల సర్జరీని ఆశ్రయించారని.. వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ తోపాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగమునేశ్వర్ రెడ్డి, వెంకటరమణ, శివశంకర్ రెడ్డి, రామకృష్నారెడ్డి అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కడపకు చెందిన వారు. హైదరాబాద్ వచ్చి ఓ హోటల్ లో మకాం వేశారు.

పైభాగంలో చర్మాన్ని తొలగించి కొంత కండర కణజాలాన్ని తీసివేసి.. తొలగించిన చర్మాన్ని తిరిగి దాన్నే కుట్టేసేవారు. ఒకటి రెండు నెలల్లోనే ఈ గాయం పూర్తిగా మానిపోయేది. ఏడాది వరకూ వేలిముద్రలు మారిపోయేవి. ఈ ఆపరేషన్ తో విదేశాలకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెట్టారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.