Begin typing your search above and press return to search.

మర్కజ్‌ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం..వారిపై కేసు నమోదు

By:  Tupaki Desk   |   2 April 2020 4:00 PM GMT
మర్కజ్‌ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం..వారిపై కేసు నమోదు
X
కరోనాతో అప్పుడప్పుడే ప్రభావితమైన భారతదేశం లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో కొంత అదుపులోకి వచ్చింది. అయితే నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వేలాది మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా వైరస్‌ విజృంభించింది. దీంతో భారతదేశంలో వెయ్యిలోపు ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మర్కజ్‌ ప్రార్థనలతో కరోనా వైరస్‌ కేసులు ఒక్కసారిగా రెండు వేలకు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా అదుపులోకి తెచ్చామని ఆనందిస్తున్న సమయంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు. అయితే ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణమైన వారిపై కేసులు నమోదు చేశారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారణ వేగవంతం చేసింది.

లాక్‌ డౌన్ - భౌతిక దూరం వంటి నిబంధనలు ఉల్లంఘించి వేల సంఖ్యలో సామూహంగా ఉండడం.. ఒకరినొకరు కౌగిలించుకోవడం వంటి వాటికి దోహదం చేసిన తబ్లీఘీ-జమాత్ సంస్థపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థ అధినేతతో పాటు ఆ కార్యక్రమ నిర్వాహకులపై ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించడంపై ప్రశ్నిస్తూ రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా తబ్లీఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ సహా మొత్తం ఏడుగురు నిందితుల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. అయితే ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసు విభాగం ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్‌ లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 269 - 270 - 271 - 120(బీ) సెక్షన్ల ప్రకారం వారిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసులు నమోదు చేసింది. ఆ సంస్థ అధినేత మౌలానా సాద్ సహా కీలక బాధ్యతల్లో ఉన్న జీషాన్ - ముఫ్తీ షెహజాద్ - యూనస్ - మహమ్మద్ సల్మాన్ - మహమ్మద్ అష్రఫ్‌ లను ప్రధాన నిందితులుగా గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా.. అంటువ్యాధి వ్యాప్తిచేసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తే వారిపై ఐపీసీ సెక్షన్ 269 ఉపయోగిస్తారు. ఈ క్రమంలో అలాంటి చర్యకు పాల్పడడంతో వారిపై కేసులు బనాయించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పై అప్రమత్తంగా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి.. కరోనా వైరస్‌ సోకిన వారితో సహవాసం చేయడం - కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేలా వ్యాఖ్యలు చేయడం తదితర వాటిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీన్ని తీవ్ర తప్పిదంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై క్షమించరాని నేరంగా భావిస్తోంది. ఈ క్రమంలో తబ్లి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం హోంశాఖ ఆదేశాలను జారీ చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో హాజరైన 960 మంది విదేశీయుల పాస్‌ పోర్టులను బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టారు. పర్యాటక వీసాలపై వచ్చిన తబ్లి జమాత్‌ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. విదేశీయుల చట్టం 1946 - విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనలను ఉల్లంఘించడంతో మొత్తం 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ విధంగా నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటనలపై కేంద్ర చేసిన ఆదేశాలతో రాష్ట్రాలు చర్యలు తీసుకోనున్నాయి. జమాత్ అధినేత మౌలానా సాద్ పరారీలో ఉన్నారని వార్తలు రాగా తాను ఎటు వెళ్లలేదని తన నివాసంలోనే క్వారంటైన్‌ లో ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశాడు.