Begin typing your search above and press return to search.

ఎంపీ సతీమణి కక్కుర్తి.. చోర్యం కేసు నమోదు

By:  Tupaki Desk   |   6 Sep 2019 5:16 AM GMT
ఎంపీ సతీమణి కక్కుర్తి.. చోర్యం కేసు నమోదు
X
ఆజాంఖాన్.. పేరు విన్నంతనే యూపీలో తిరుగులేని నేతగా పేరు. వివాదాలు ఎన్ని ఉన్నా.. ఎన్నికలు వచ్చే నాటికి ఆయనకు ఓట్లు వేయకుండా ఓటర్లు ఉండలేరు. అందుకే ఎన్నిక ఏదైనా.. విజయం మాత్రం ఆయనదే. నోటి దురుసుతో పాటు.. ఒక నేతకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఆయనలో ఉంటాయని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు.

తానేం చేసినా.. తానేం మాట్లాడినా ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇటీవల లోక్ సభలో మాట తూలారు. దీంతో.. అధికారపక్షంతో పాటు.. కొందరు విపక్ష నేతలు తప్పన్నారు. దీంతో.. నన్నేం చేయలేరంటూ సభ నుంచి వెళ్లిపోయిన ఆయన.. తర్వాత సారీ చెప్పక తప్పలేదు. తలబిరుసుతనంతో ఇప్పటివరకూ తిరుగులేని నేతగా చెలామణి అయిన ఆయనకు ఇటీవల కాలంలో కొత్త కష్టాలు షురూ అయ్యాయి.

చేసిన తప్పులకు ఎప్పుడో ఒకప్పుడు మూల్యం చెల్లించుకోకతప్పదన్న దానికి తగ్గట్లే.. తాజాగా ఆయనకు వరుస పెట్టి చిక్కులు మొదలయ్యాయి. ఒక గేదెను దొంగతనం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన ఆయనకు.. ఆయన కుమారుడిపైనా పలు కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికి మించి తాజాగా ఆజాంఖాన్ సతీమణి మీద చౌర్యం కేసు నమోదైంది.

ఆజాంఖాన్ కు ఒక రిసార్ట్ ఉంది. అందులో విద్యుత్ ను ఆక్రమంగా వాడేస్తున్న విషయాన్ని తాజాగా గుర్తించారు. రిసార్టులో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేయటంతో ఆయన కరెంటును దొంగతనం చేస్తున్న వైనాన్ని కనిపెట్టారు. రాంపూర్ లో ఉన్న రిసార్టులో ఒక పరికరం సాయంతో విద్యుత్ శాఖ నుంచి తీసుకున్న అనుమతికి మించిన సామర్థ్యంతో విద్యుత్ ను ఆక్రమంగా వినియోగిస్తున్న వైనాన్ని గుర్తించారు.

దీంతో.. ఆజాంఖాన్ సతీమణి తజీన్ ఫాతిమాపై కేసు నమోదు చేశారు. రిసార్టుకు విద్యుత్ ను ఆక్రమంగా వాడేస్తారన్న ఆరోపణ ఆజాంఖాన్ అండ్ ఫ్యామిలీ మీద ఇదే తొలిసారి కాదు. సమాజ్ వాదీ పార్టీ పవర్లో ఉన్నప్పుడూ ఆయనపైన ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కాకుంటే.. అప్పట్లో సొంత పార్టీ సర్కారు ఉండటంతో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న మాట ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఎవరూ తననేం చేయలేరన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎంతటి వారినైనా దెబ్బ తీస్తుంది. అందుకు ఆజాంఖాన్ మినహాయింపు కాదు. అయినా.. కేంద్రంలో మోడీ సర్కారు చేతికి పగ్గాలు వచ్చిన తర్వాతైనా ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే ఇలానే ఉంటుంది మరి అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.