Begin typing your search above and press return to search.

యాగశాలలో అగ్రిప్రమాదం తీవ్రత ఎంత?

By:  Tupaki Desk   |   27 Dec 2015 9:01 AM GMT
యాగశాలలో అగ్రిప్రమాదం తీవ్రత ఎంత?
X
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి సంబంధించిన ఆఖరి రోజున పెద్ద అపశృతే చోటు చేసుకుంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అగ్నిప్రమాదం తీవ్రత కాస్త ఎక్కువన్న మాట వినిపిస్తోంది. చివరి రోజున.. మరి కొద్దిగంటల్లో యాగం పూర్తి కానున్న వేళ.. చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం.. కలకలం రేపింది. దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

యాగం చివరి రోజు కావటం.. పెద్ద ఎత్తున హోమంలో వేసిన ఆవునెయ్యి.. హోమ ద్రవ్యాల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పూర్ణాహుతికి ముందు.. ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.

యాగ క్రతువులో భాగంగా ఆదివారం ఉదయం నుంచి కిలోల కొద్దీ కర్పూరం.. ఆవునెయ్యిని 101 భారీ హోమ గుండాల్లో రుత్వికులు వేస్తున్నారు. వీటిని వేసి.. చివర్లో పూర్ణాహుతి సమర్పించేందుకు కాస్తంత విరామం వచ్చింది. దీంతో.. విరామం కోసం లేచిన వేళ.. యాగ మండపంలోని ఒక హోమ గుండం నుంచి నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఎగిశాయి. వీటి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. పైకి ఎగిసిన నిప్పు రవ్వలు యాగశాల పై కప్పును తాకటం.. ఒక్కసారిగా నిప్పు అంటుకోవటం క్షణాల్లో జరిగిపోయింది.

నిమిషం వ్యవధిలోనే వరిగడ్డితో నిర్మించిన యాగశాల పైకప్పు ఒక్కసారిగా తగలబడింది. దీంతో.. ఆందోళన చెందిన రుత్వికులు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు దీశారు. వెనువెంటనే అగ్రిప్రమాద సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేశారు. అయిత.. ఈ అగ్నిప్రమాదంతో యాగశాలలోని హోమ ద్రవ్యాలు భారీగా కాలిపోయినట్లు చెబుతున్నారు. పలువురు రుత్వికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయని.. వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లుగా చెబుతున్నారు. స్వల్ప అగ్నిప్రమాదమే అయినా.. దాని తీవ్రత కాస్త ఎక్కువనే చెప్పాలి.