Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ.. కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. నష్టం ఎంతంటే?

By:  Tupaki Desk   |   7 Feb 2021 5:00 AM GMT
అర్థరాత్రి వేళ.. కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. నష్టం ఎంతంటే?
X
పాతబస్తీకి కాస్త దగ్గరగా.. ముప్ఫై ఏళ్ల క్రితం హైదరాబాద్ షాపింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో షాక్ కు గురయ్యే పరిస్థితి. తొలుత ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఐదు షాపులకు వ్యాపించాయి. దుస్తుల దుకాణం కావటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసేసిన తర్వాత యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవటం పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది.

బట్టల షాపు కావటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. షాపులు మూసేసిన తర్వాత.. యజమానులుఇంటికి వెళ్లిన తర్వాత మంటలు రాజుకున్నాయి. బట్టల దుకాణం కావటంతో ఒక షాపు తర్వాత మరొకటి చొప్పున మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు పరుగు.. పరుగున ఘటనా స్థలానికి చేరుకొని అగ్నికి ఆహుతి అవుతున్న షాపుల్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

కళ్ల ముందు షాపుల్లో సామాను తగలబడిపోవటంతో.. కొందరు యజమానులు.. ప్రాణాలకు తెగించి షాపుల్లోకి వెళ్లి సామాను తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్న పోలీసులు వారిని బలవంతంగా అడ్డుకున్నారు. గడిచిన నలభై ఏళ్లుగా షాపులు ఏర్పాటు చేసుకొని కోఠిలోనే జీవనం సాగిస్తున్నామని.. తాజా అగ్నిప్రమాదంతో అన్ని కోల్పోయి రోడ్డున పడ్డట్లుగా బాధితులు వాపోతున్నారు.

భారీ అగ్నిప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో.. ట్రాఫిక్ ను మళ్లించారు. అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకొని నాలుగు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యుట్ కారణంగా మంటలు చెలరేగాయా లేక.. వేరే కారణమా? అన్న కోణంలో అగ్నిమాపక శాఖ విచారణ జరుపుతోంది.