Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ.. చిత్తూరు కలెక్టరేట్లో అగ్నిప్రమాదం

By:  Tupaki Desk   |   11 April 2019 4:51 AM GMT
అర్థరాత్రి వేళ.. చిత్తూరు కలెక్టరేట్లో అగ్నిప్రమాదం
X
అందరూ గాఢంగా నిద్ర పోతున్న వేళ చిత్తూరు కలెక్టరేట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంచలనంగా మారింది. కీలకమైన ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు చేసిన గదిలోనే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం గమనార్హం. బుధవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం కారణంగా.. ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఈడీ తెరతో పాటు.. 112 ల్యాప్ టాప్ లు.. ఇతర ఎన్నికల సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయాయి.

గురువారం ఉదయం ప్రారంభమయ్యే ఎన్నికల్ని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చిత్తూరు కలెక్టరేట్లోని వివేకానంద భవన్ లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడనుంచి పోలింగ్ స్టేషన్లను పర్యవేక్షించటం.. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ క్రమంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా గదిలోని పది ఏసీలు.. 30 ఫ్యాన్లతో పాటు ఇతర సామాగ్రి కూడా కాలి బూడిదైపోయాయి. విచిత్రమైన విషయం ఏమంటే.. ఇదే భవనాన్ని గత ఏడాది రూ.20 లక్షలతో ఆధునికీకరించటం. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారి.. పాలనాధికారి పీఎస్ ప్రద్యుమ్న ఘటనాస్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించిన మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం ఏమిటన్న విషయంపై ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఏసీ నుంచి షార్ట్ సర్క్యుట్ సంభవించి విద్యుత్ తీగలకు అంటుకోవటం.. వాటి ఛార్జింగ్ నిమిత్తం ల్యాప్ టాప్ లు అనుసంధానించి ఉండటంతో మంటలు భారీగా వ్యాపించినట్లుగా చెబుతున్నారు.