Begin typing your search above and press return to search.

ఐకియా హైద‌రాబాద్‌ లో అగ్నిప్ర‌మాదం ...అంతాసేఫ్‌

By:  Tupaki Desk   |   3 March 2019 5:10 PM GMT
ఐకియా హైద‌రాబాద్‌ లో అగ్నిప్ర‌మాదం ...అంతాసేఫ్‌
X
ఐకియా హైద‌రాబాద్‌ స్టోర్ మ‌రోమారు ఊహించ‌ని వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. హైదరాబాద్ మాదాపూర్‌ లోని ఈ స్టోర్‌ లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సెల్లార్ వన్‌ లో ఒక్కసారి మంటలు చెలరేగడంతో స్టోర్ వచ్చిన కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. భయంతో స్టోర్ నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. వెంటనే స్పందించిన ఐకియా సిబ్బంది మంటలను ఆర్పేశారు.

గ‌త ఏడాది ఆగ‌స్టులో దేశంలోనే మొట్టమొదటి ఐకియ షోరూమ్‌ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ప్రారంభానికి జనం ఎగబడ్డారు. ఆ ప్రాంతమంతా తిరునాళ్లను తలపించింది. షో రూంలోకి వెళ్లేందుకు కనీసం 3 నుంచి 4 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్ధితి. మొదటి రోజు కావటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి జనం షోం రూం చూసేందుకు పరుగులు తీశారు. వచ్చిన జనాన్ని కంట్రోల్ చేసేందుకు సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. షోరూమ్‌ కు వచ్చే వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను ఐకియ ప్రకటించింది. అయితే, దాదాపు నెల‌రోజుల‌కే ఐకియా రెస్టారెంట్‌ లోని వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు బయటపడింది. ఐకియా రెస్టారెంట్‌ లో వెజ్‌ బిర్యానీ తీసుకున్నానని - అందులో గొంగళి పురుగు ఉందంటూ అబీద్‌ మహ్మద్‌ అనే వ్యక్తి ఫొటోలతో సహా ట్విట్టర్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జీహెచ్‌ ఎంసీ ఆరోగ్య విభాగం - వెటర్నరీ అధికారులు శనివారం రెస్టారెంట్‌ పై దాడులు నిర్వహించి రూ.11,500 జరిమానా విధించారు. రెస్టారెంట్‌ లో కొన్ని నిబంధనలను పాటించడం లేదని ఈ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.

కాగా, తాజాగా అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఆదివారం సెల‌వు రోజు కావ‌డంతో పెద్ద ఎత్తున వినియోగ‌దారులు స్టోర్లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. కాగా, అగ్నిప్రమాదంతో ఐకియా భద్రతా ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.