Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో ఘోరం : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం .. 13 మంది భాదితులు మృతి !

By:  Tupaki Desk   |   23 April 2021 4:30 AM GMT
మహారాష్ట్రలో ఘోరం : ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం .. 13 మంది భాదితులు మృతి !
X
మహారాష్ట్ర లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. మొదటి వేవ్ లో మహారాష్ట్రని భయపెట్టిన కరోనా , ఇప్పుడు సెకండ్ వేవ్ లో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోని నమోదు అవుతున్నాయి. అలాగే భారీగా మృతి చెందుతున్నారు. కరోనా మృతులకు తోడు మహారాష్ట్రలోని హాస్పిటల్స్ లో వరుస ప్రమాదాలు కూడా రోగుల ప్రాణాలు తీస్తున్నాయి. నాసిక్‌ లో ఆక్సీజన్ ట్యాంకర్ లీకై 24 మంది మరణించిన ఘటనను మరవక ముందే.. మరో ఘోరం జరిగింది. పాల్‌ ఘఢ్ జిల్లాలోని విరార్‌ లో ఓ కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది రోగులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే ... వాసయ్ విరార్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో 17 మంది రోగులు కరోనా మహమ్మారి భారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే , అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉండడం.. మంటలు వేగంగా వ్యాపించడంతో.. రోగులు తప్పించుకునే అవకాశం పెద్దగా లేకుండా పోయింది. మంటల్లో చిక్కుకొని కొందరు, పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం 13 మంది రోగులు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఫర్నిచర్, ఇతర సామాగ్రి మొత్తం కాలి బూడిదయింది. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఐతే ఐసీయూలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.