Begin typing your search above and press return to search.

వందలాది రైళ్లు ఆగిపోయే పెద్ద ముప్పును అలా తప్పిందట

By:  Tupaki Desk   |   16 March 2021 11:10 AM GMT
వందలాది రైళ్లు ఆగిపోయే పెద్ద ముప్పును అలా తప్పిందట
X
కాస్త ఆలస్యంగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని రైల్వే టికెట్ల జారీ.. రిజర్వేషన్ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆటంకం కలిగే పెద్ద ముప్పు త్రుటిలో తప్పినట్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండటంతో పాటు.. అనుకోని విపత్తులు విరుచుకుపడినప్పుడు డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిస్టం భారీ నష్టం చోటు చేసుకోకుండా ఆపినట్లుగా చెబుతున్నారు. ఈ నెల 8న కోల్ కతాలో రైల్వేలకు సంబంధించిన పదమూడు అంతస్తుల భవనంలో ఈ నెల 8న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఉదంతంలో తొమ్మిది మంది మరణించారు. ఈ భవనంలోనే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (క్రిస్) కార్యాలయం ఉంది. అగ్నిప్రమాదం కారణంగా ఈ కేంద్రంతో పాటు రైల్వేలకు సంబంధించిన అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరాతో పాటు.. ఇతర సేవల్ని నిలిపివేశారు. దీంతో.. ఆ రోజు రాత్రి 7.30 గంటల నుంచి రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కేంద్రాలతో పాటు.. ఐఆర్ సీటీసీ ఆన్ లైన్ బుకింగ్ పూర్తిగా నిలిచిపోయింది. జనరల్ టికెట్ల విక్రయాలు ఆగిపోయాయి.

ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల రైల్వే సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో.. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే సికింద్రాబాద్ క్రిస్ ప్రాంతీయ కేంద్ర జీఎం రవిప్రసాద్ పాడిని అప్రమత్తం చేశారు. ఆయనతో పాటు ఇతర సాంకేతిక సిబ్బంది మూడున్నర గంటల పాటు కష్టపడి 15 రాష్ట్రాల్లో రైల్వే సేవలకు అంతరాయం కలగకుండా చేసిన వైనం బయటకు వచ్చింది. ఇందుకోసం అక్కడి సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహించాల్సి వచ్చింది. భూకంపాలు.. వరదలు లాంటి విపత్తులు వచ్చినప్పుడు రైల్వే రిజర్వేషన్ తో పాటు ఇతర వ్యవస్థలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు సికింద్రాబాద్ లో ఈ కేంద్రాన్ని 2013లో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లో క్రిస్ ప్రత్యామ్నాయ కేంద్రం లేకుండా ఉండి ఉంటే.. పరిస్థితి దారుణంగా మారేది.