Begin typing your search above and press return to search.

రేవంత్ చెప్పిన షాకింగ్ నిజాలు వింటే విస్మయం పక్కా

By:  Tupaki Desk   |   18 July 2021 4:30 AM GMT
రేవంత్ చెప్పిన షాకింగ్ నిజాలు వింటే విస్మయం పక్కా
X
గతంలో మీడియాలో వచ్చే వార్తలు రాజకీయ పరిణామాలకు కీలకంగా మారేవి. పాత్రికేయులు వెలుగులోకి తీసుకొచ్చే అంశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణం కావటమే కాదు.. సరికొత్త రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సంచలన అంశాల్ని పబ్లిక్ తో షేర్ చేసుకోవటానికి మీడియా సంస్థలు మొహమాట పడేవి కావు. కానీ.. ఇప్పుడు సవాలక్ష సందేహాల్ని తమకు తామే వేసుకొని.. సమాచారాన్ని సెన్సార్ చేసేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

దీంతో రాజకీయ నేతలే మీడియా పాత్ర పోసిస్తున్నారు. ఒక పార్టీకి చెందిన వారు తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన అంశాలు.. పార్టీ నేతల ప్రైవేటు.. వ్యాపార అంశాల్ని సమయానికి తగ్గట్లుగా ప్రస్తావించి సంచలనంగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని చేపట్టిన ఫైర్ బ్రాండ్ రేవంత్ చెలరేగిపోతున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా పేరు ప్రకటించినంతనే ఆయనలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఎప్పటికప్పుడు సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. వరుస ఆందోళనల్ని నిర్వహిస్తూ ప్రభుత్వానికి కొత్త సవాలు విసురుతున్నారు.

కాలం చెల్లిన పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు అంశాన్ని టేకప్ చేసి.. ఎంతటి రచ్చ చేశారో తెలిసిందే. అలాంటి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి కొత్త చర్చకు కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రికి థింక్ ట్యాంక్ గా.. ఆయనేం చెబితేవెనుకా ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేయటమే కాదు.. మంత్రులు నిర్వహించాల్సిన ప్రెస్ మీట్ ను తానే నిర్వహించే విలక్షణత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సొంతమన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.

అలాంటి ఆయన సీఎస్ పదవిలో కొనసాగటానికి కారణం ఏమిటో తెలుసా? అంటూ రేవంత్ కొత్త వాదనను వినిపించారు. ఆయన చెప్పిన మాటల్ని ఆయన నోటి నుంచే వింటే బాగుంటుంది. సీఎస్ సోమేశ్ కుమార్ మీద రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన చోటల్లా సంతకం పెడుతున్నందుకే సీఎస్ గా సోమేశ్ కుమార్ ఆ పదవిలో కొనసాగుతున్నారు. అసలు ఆయనకు ఆ స్థానంలో పని చేసే అర్హత లేదు. ఏపీ కేడర్ కు చెందిన ఆయన్ను అక్కడకు వెళ్లాలని క్యాట్ ఆదేశిస్తే.. దాన్ని హైకోర్టులో సవాల్ చేసి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన ఫైలు కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని హైకోర్టులో సోమేశ్ కుమార్ కేసు విచారణ జరిగేలా చూడాలి. రాష్ట్రంలో జరుగుతున్న భూకుంభకోణాల్లో సీఎస్ పాత్ర ఉంది’’ అని ఆరోపించారు. మరి.. దీనికి కేసీఆర్ అండ్ కో ఏమని చెబుతారో చూడాలి.