Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ లో ఘోరం.. 7 ప్రాణాలు తీసిన షోరూం అగ్నిప్రమాదం

By:  Tupaki Desk   |   13 Sep 2022 3:47 AM GMT
సికింద్రాబాద్ లో ఘోరం.. 7 ప్రాణాలు తీసిన షోరూం అగ్నిప్రమాదం
X
సికింద్రాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. పాస్ పోర్టు కార్యాలయానికి దగ్గర్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఏకంగా ఏడు ప్రాణాలు తీయగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్న పరిస్థితి. షార్ట్ సర్క్యుట్ కారణంగా మంటలు చెలరేగటం.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఈ-స్కూటర్లు వరుస పెట్టి పేలటంతో ఆ ప్రాంతం మొత్తం భారీ శబ్దాలతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున మంటలు.. పొగ కమ్మేయటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని అయోమయం. దీనికి తోడు ఈ షోరూం పైన లాడ్జి ఉండటం.. అందులో పెద్ద ఎత్తున గెస్టులు ఉండటంతో ప్రాణహాని ఎక్కువగా జరిగినట్లుగా చెబుతున్నారు.

మంటల కారణంగా కొందరు ప్రాణభయంతో పై నుంచి కిందకు దూకేయగా.. వారంతా తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏడుగురు మరణించగా.. మరికొందరు తీవ్రగాయాలయ్యాయి. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ ఎలక్ట్రికల్ షోరూం ఉంది. సెల్లార్ లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది.

రాత్రి 8-45 గంటల ప్రాంతంలో షార్ట్ సర్య్కేూట్ తో ఒక ఈ-స్కూటర్ పేలిపోయింది. చూస్తుండగానే వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి పన్నెండు గంటల సమయంలోనూ ఈ- బ్యాటరీల పేలుళ్లు కొనసాగుతున్నాయి.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గోదాములో ఎవరూ లేనప్పటికీ.. ఈ షోరూం పైన ఉన్న హోటల్ గదుల్లో పాతిక మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయాలైన వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురు గాంధీఆసుపత్రిలోని బర్నింగ్ వార్డ్ లో చికిత్స అందజేస్తున్నారు.

ఇంత తీవ్రత ఎందుకంటే.. రూబీ ఎలక్ట్రికల్ షోరూం పైన హోటల్ మొత్తం ఐదు అంతస్తుల్లో నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ హోటల్ బిల్డింగ్ లోకి వెళ్లటానికి.. బయటకు రావటానికి ఒకే దారి ఉంది. భవనానికి ఎలాంటి సెట్ బ్యాక్స్ లేవు. దీంతో.. మంటల్ని అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడ్డారు. అగ్నిప్రమాదం జరిగిన 45 నిమిషాలకు ఫైరింజన్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. హోటల్ గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లుగా చెబుతున్నారు.

షోరూం గోదాముల్లో ఈ-స్కూటర్లను పార్కు చేస్తారు. స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్ చేస్తుంటారు. ఆ ప్రాంతంలో షార్ట్ సర్క్యుట్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు పలువురు హోటల్ లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తుకారంగేట్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ అంబటి ఆంజేయులు ప్రాణాలకు తెగించి.. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. కొందరిని కిందకు తీసుకొచ్చారు. ఈ కారణంగా ప్రాణ నష్టం తగ్గినట్లుగా చెబుతున్నారు. అంబటి ఆంజనేయుల్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.