Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రి ఛాంబర్‌ లో మంట‌లు లేచాయ్‌...

By:  Tupaki Desk   |   27 April 2016 10:30 AM GMT
ముఖ్య‌మంత్రి ఛాంబర్‌ లో మంట‌లు లేచాయ్‌...
X
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రికి భ‌ద్ర‌త అంటే ఎలా ఉంటుంది..? ఏపీ సీఎం చంద్ర‌బాబునే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే చిన్న చీమ కూడా చొర‌బ‌డ‌నంత‌గా భ‌ద్ర‌తా ఏర్పాట్లు ఉంటున్నాయి. మ‌రి... మిగ‌తా రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రులు ఆ స్థాయి భ‌ద్ర‌తను పొందుతున్నారా అంటే లేద‌నే చెప్పాలి. తాజాగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ చాంబ‌ర్ లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద‌మే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న చాంబ‌ర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క‌ల‌క‌లం రేగింది. అదికారులు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే స్పందించ‌డంతో న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అగ్నిమాప‌క సిబ్బంది చేరుకుని వెంట‌నే మంట‌ల‌న ఆర్పేశారు. అయితే... ఈ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి న‌వీన్ ఢిల్లీలో వుండడంతో ఈ అగ్ని ప్ర‌మాదం వెనుక కుట్ర ఉంద‌న్న అనుమానాలు ఏర్ప‌డుతున్నాయి.

న‌వీన్ ఛాంబర్‌ లోని టీవీకి ఏర్పాటుచేసిన సెట్‌ టాప్‌ బాక్స్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు. టీవీ - ఫర్నిచర్‌ ధ్వంసమ‌య్యాయి. చాంబ‌ర్ లోని కీల‌క ప‌త్రాల‌న్నీ భ‌ద్రంగా ఉన్నాయ‌ని... ఏవీ త‌గ‌ల‌బ‌డ‌లేద‌ని బీజేడీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అయితే.. అవినీతి ప‌రుల విష‌యంలో న‌వీన్ వ్య‌వ‌హ‌రించే తీరు కార‌ణంగా బీజేడీలో కొంద‌రు నేత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. అవినీతిని ఏమాత్రం స‌హించ‌ని న‌వీన్ త‌ప్పుంద‌ని తేలితే సొంత పార్టీ నేత‌ల ప‌ట్లా చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు అవినీతి వ్య‌వ‌హారాల్లో న‌వీన్ కంటికి చిక్కి ప‌ద‌వులు పోగొట్టుకున్నారు. మ‌రి కొంద‌రు నేత‌ల‌పైనా క‌త్తి వేలాడుతోంది. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రులు - ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాల‌పై స‌మాచారం తెప్పించుకునే అల‌వాటు ఉన్న న‌వీన్ వ‌ద్ద బీజేడీ నేత‌ల వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన కీల‌క ప‌త్రాలు - ఆధారాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. వాటిని ధ్వంసం చేసే ఉద్దేశంతో పార్టీలోని క‌ళంకితులు ఈ కుట్ర చేశారా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాగా న‌వీన్ ఒడిశాలో లేని స‌మ‌యంలోనే ఇలాంటివి గ‌తంలోనూ జ‌రిగాయి. రికార్డు స్థాయిలో 2000 సంవ‌త్స‌రం నుంచి వ‌రుసగా ముఖ్య‌మంత్రిగా ఉన్న ఈ బీజేడీ అధినేత 2000లో ఒడిశా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత 12 సంవ‌త్స‌రాల పాటు దేశం విడిచి వెళ్ల‌లేదు. ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ప‌న్నెండేళ్ల‌కు తొలిసారిగా 2012లో ఆయ‌న లండ‌న్ వెళ్ల‌గా తిరుగుబాటు జరిగింది. అప్ప‌టికి ఆయ‌న కుడిభుజంగా ఉన్న ప్యారీమోహ‌న్ మ‌హాపాత్రో పార్టీలో తిరుగుబాటు లేపారు. ఆ స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే న‌వీన్ ఒడిశాకు తిరిగొచ్చి ప్యారీమోహ‌న్‌ - ఆయ‌న‌తో క‌లిసిన‌వారిపై వేటు వేశారు. అనంత‌రం ప్యారీమోహ‌న్‌ - ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వారంతా రాజ‌కీయంగా స‌మాధైపోయారు. అప్ప‌టి కుట్ర‌లో ఉన్న కొంద‌రు ఆ తరువాత న‌వీన్ ను శ‌ర‌ణు వేడుకోవ‌డంతో వారిని క్ష‌మించి మ‌ళ్లీ ఆద‌రించారాయ‌న‌. అయితే... త‌నకు అత్యంత స‌న్నిహితంగా పార్టీ నేత‌ల‌ను కూడా ఆయ‌న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై తొల‌గించిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా మ‌రికొంద‌రు నేత‌ల‌కు సంబంధించిన అవినీతిపై ఆధారాలు ఆయ‌న వ‌ద్ద ఉన్నాయ‌ని.. త్వ‌ర‌లో వారిపై చ‌ర్య‌లుంటాయ‌ని తెలుస్త‌న్న నేప‌థ్యంతో న‌వీన్ చాంబ‌ర్‌ లో జ‌రిగిన ఈ అగ్రిప్ర‌మాదం చ‌ర్చ‌నీయ‌మైంది.