Begin typing your search above and press return to search.

రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..

By:  Tupaki Desk   |   8 Oct 2018 6:20 AM GMT
రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు తెరలేవడంతో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. జబల్ పూర్ లో 8 కి.మీల భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ మూడు రంగుల బెలూన్లతో రాహుల్ కు స్వాగతం పలకడానికి పెద్ద వాటిని తీసుకొచ్చారు. అప్పుడే రాహుల్ కు హారతి ఇచ్చేందుకు మహిళలు వచ్చారు. ఆ హారతి మంటలు బెలూన్లకు అంటుకొని అందులోని నైట్రోజన్ వాయువు మండి భారీ మంటలు చెలరేగాయి. అయితే నైట్రోజన్ గ్యాస్ కొద్ది సెకండ్లలోపే అయిపోవడంతో మంటలు చెలరేగి ఆరిపోయాయి.

నైట్రోజన్ వాయువుతో పెద్ద ఎత్తున ఒకే సారి మంటలు చెలరేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. వాహనం మీద ఉన్న రాహుల్ కూడా ఒక్కసారిగా వచ్చిన మంటలకు భయపడి పక్కకు జరిగారు. మంటలు ఆయన వరకూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనంపై రాహుల్ గాంధీతోపాటు జ్యోతిరాధిత్య సింధియా - కమల్ నాథ్ లు ఉన్నారు.

భద్రతాలోపాల వల్లే రాహుల్ గాంధీ ర్యాలీలో ఈ మంటలు చెలరేగాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. దీనిపై జబల్ పూర్ ఎస్పీ అమిత్ సింగ్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వాహనానికి - కార్యకర్తల బెలూన్లకు మధ్య 15 మీటర్ల దూరం ఉందని.. హారతి ఇచ్చింది.. బెలూన్లు తెచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలేనని వివరణ ఇచ్చారు. ఇందులో భద్రతలోపాలు లేవని.. కాంగ్రెస్ నేతల స్వయంకృతాపరాధాలేనని స్పష్టం చేశారు.