Begin typing your search above and press return to search.

'రంగా' పేరును పెట్టకపోవటంపై జగన్ పై ఫైర్

By:  Tupaki Desk   |   6 April 2022 9:24 AM GMT
రంగా పేరును పెట్టకపోవటంపై జగన్ పై ఫైర్
X
కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఉన్న అభ్యంతరాలు ఒకవైపు అలానే ఉండిపోగా.. కొత్త జిల్లాల ప్రక్రియ కూడా పూర్తైంది. అయితే.. అభ్యంతరాలు వచ్చినంత భారీగా.. వాటి అమలు మీద పోరాటాలు.. నిరసనలు చోటు చేసుకోలేదనే చెప్పాలి. కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఇరుకున పడేలా మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న నిరసనలు.. ఆందోళనలతో పోలిస్తే ఏపీలో తెర మీదకు వచ్చిన డిమాండ్లను వేళ్ల మీద లెక్కించొచ్చు.

అయితే.. ఒక అంశం మీద నివురు కప్పిన నిప్పులా ఉందని చెప్పాలి. విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరును పెట్టాలన్న డిమాండ్ సంగతి తెలిసిందే. అయితే.. బందరు జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును డిసైడ్ చేసిన నేపథ్యంలో విజయవాడ జిల్లాకు వంగవీటి పేరును ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నను వినిపిస్తున్నారు. 13పాత జిల్లాల స్థానంలో కొత్తగా 26 జిల్లాల్ని ఏర్పాటు చేయటం.. అందులో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో నాలుగు జిల్లాలకు ప్రముఖుల పేర్లను పెట్టటం తెలిసిందే. పాత జిల్లాల్లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే.

కొత్త జిల్లాల్లో ఎన్టీఆర్.. అల్లూరు సీతారామరాజు.. శ్రీ సత్యసాయి.. అన్నమయ్య పేర్లతో జిల్లాల్ని ఏర్పాటు చేశారు. మిగిలిన వాటితో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఎన్టీఆర్ పేరుతో పెట్టిన జిల్లాకు వంగవీటి పేరును పెట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే ఎన్టీఆర్ పేరును ఇంకో జిల్లాకు పెట్టి విజయవాడ పట్టణం ఉండే జిల్లాకు వంగవీటి పేరును పెట్టకపోవటంతో కాపు సామాజిక వర్గం హర్ట్ అయ్యిందన్న వాదనను వినిపిస్తున్నారు.

సీనియర్ రాజకీయ నేత.. కాపు నేతగా సుపరిచితులు చేగొండి హరిరామయ్య జోగయ్య కొత్త జిల్లాల్లో వంగవీటి పేరును పెట్టకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత కాంగ్రెస్ నేత వంగవీటి పేరును జిల్లా పేరుగా నిర్ణయించకపోవటం సరైనది కాదన్నది ఆయన వాదన.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని విస్మరించారని.. కాపు సామాజిక వర్గానికి వేదన కలిగించారని చెబుతున్నారు. జోగయ్య మాటలు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టటాన్ని వ్యతిరేకించినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదన మరింత జోరు అందుకుంటే.. కమ్మ.. కాపు మధ్య లేని వివాదానికి తెర తీసినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన జోగయ్య తన డిమాండ్ ను వినిపిస్తూనే.. తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు.

వంగవీటి పేరును పెట్టకపోవటం ద్వారా కాపుల మనసుల్ని గెలుచుకునే అవకాశాన్ని జగన్ మిస్ అయ్యారనంటున్నారు. మరి.. అలాంటి వారి డిమాండ్ అయిన వంగవీటి మీద జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.