Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు..సోనియా అస‌హ‌నం

By:  Tupaki Desk   |   16 Dec 2017 1:47 PM GMT
రాహుల్‌ కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు..సోనియా అస‌హ‌నం
X
కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థిగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సంద‌ర్భంగా రెండు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్య‌ రీతిలో రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీ భ‌విష్య‌త్ రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే స‌మయంలో సోనియాగాంధీ అస‌హ‌నానికి లోన‌య్యారు. వచ్చే ఎన్నికల్లో రాయ్‌ బరేలీ నుంచి సోనియా కూతురు ప్రియాంకా గాంధీ వద్రా ఎవరు పోటీ చేస్తారనే వార్త‌లు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ రాహుల్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరైన ప్రియాంక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సోనియా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్క‌డి నుంచి ప్రియాంక పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి తల్లి సోనియానే పోటీ చేస్తారని ప్రియాంకా స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గం ప్ర‌జ‌లు త‌మ‌కు వ‌రుస‌గా ప‌ట్ట‌కట్ట‌డం సంతోష‌క‌ర‌మ‌ని ప్రియాంకా అన్నారు. ఇదిలాఉండ‌గా...రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోనియా అసహనానికి లోనయ్యారు. సోనియా తన ప్రసంగాన్ని హిందీలో మొదలు పెట్టి... `ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలారా! కాంగ్రెస్ అధినేత్రిగా ఇది నా చివరి ప్రసంగం. నేటి నుంచి మీరు కొత్త నాయకత్వంలో పని చేయాలి `అని సోనియా వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా రాహుల్ అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో సోనియా ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్ నేత జనార్ధన్ ద్వివేది.. బాణాసంచా కాల్చవద్దని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయిన‌ప్ప‌టికీ...ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోవ‌డంతో...సోనియా తన ప్రసంగాన్ని ఆపేశారు. `నా ప్రసంగం కొనసాగించాలంటే.. అరవాల్సి వస్తుంది. ఇలాగే బాణాసంచా కాల్చితే.. తాను మాట్లాడలేను.. అరవలేను` అని సోనియా అసహనానికి లోనయ్యారు. కాసేపు ప్రసంగించకుండా అలాగే ఉండిపోయారు. తర్వాత రాహుల్.. సోనియా వద్దకు చేరుకుని సర్దిచెప్పడంతో మళ్లీ సోనియా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.