Begin typing your search above and press return to search.

మాదాపూర్‌ లో కాల్పుల క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   20 Aug 2015 10:40 AM GMT
మాదాపూర్‌ లో కాల్పుల క‌ల‌క‌లం
X
నిత్యం హ‌డావుడిగా ఉంటూ.. ఐటీ జ‌నాల‌తో సంద‌డిగా ఉండే మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు 36లో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. గురువారం మ‌ధ్యాహ్నం 1.30గంట‌ల ప్రాంతంలో మాదాపూర్‌ లోని నీరూస్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

స్థానికుల స‌మాచారం మేర‌కు.. ఒక వ్య‌క్తిని పోలీసులు వెంబ‌డిస్తూ రావ‌టం.. నీరూస్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి కాల్పుల మోత వినిపించింద‌ని.. ఈ కాల్పుల‌కు మెట్రో వ‌ర్క్స్ చేస్తున్న ధ‌ర్మేంద్ర సింగ్ కు గాయాల‌య్యాయి. అయితే.. కాల్పులు జ‌రిపింది పోలీసులా? ఆగంత‌కుడా అన్న‌ది ఒక ప‌ట్టాన తేల‌టం లేదు. ఈ విష‌యంపై ఒక పోలీసు అధికారి లోగుట్టుగా చెప్పిన వివ‌రాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ఒక అనుమానాస్ప‌ద వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు పోలీసులు వెంబ‌డించ‌గా.. నీరూస్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి.. స‌ద‌రు వ్య‌క్తి వెప‌న్ తీసుకున్న‌ట్లుగా గుర్తించిన పోలీసులు.. అత‌ను కాల్పులు జ‌రుపుతాడ‌న్న సందేహంతో తామే ముంద‌స్తుగా కాల్పులు జ‌రిపార‌ని.. ఈ క్ర‌మంలో కాల్పుల్లో మెట్రో వ‌ర్క్స్ కు చెందిన కార్మికుడు ధ‌ర్మేంద్ర‌సింగ్‌ కు గాయాలైన‌ట్లు చెబుతున్నారు.

ఈ ఉదంతంలో ఆగంత‌కుడ్ని స్థానికులు ప‌ట్టుకోగా.. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఇత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రు ఉన్నార‌ని.. వారు త‌ప్పించుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక‌.. ప‌ట్టుబ‌డిన ఆగంత‌కుడు ఫ‌హీమ్‌ గా భావిస్తున్నారు. క‌ర్ణాట‌క దోపిడీ ముఠాకు చెందిన వాడ‌ని.. బ్యాంకులు.. ఏటీఎంలే ల‌క్ష్యంగా దోపిడీల‌కు ఈ ముఠా పాల్ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఫ‌హీమ్‌ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మ‌రింత స‌మాచారం బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.