Begin typing your search above and press return to search.

మాటల్లో ఫైరింగ్.. చేతల్లో ఎప్పుడు చూపిస్తారు కేసీఆర్?

By:  Tupaki Desk   |   12 Feb 2022 1:30 PM GMT
మాటల్లో ఫైరింగ్.. చేతల్లో ఎప్పుడు చూపిస్తారు కేసీఆర్?
X
మాటలతో మంట పుట్టించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా.. తాను ఆశించిన ఫలితం రాకున్నా.. తాను కోరుకున్న రాజకీయ పరిణామాలు జరగకున్నా.. అస్సలు తట్టుకోలేరు. అప్పటివరకు తనకేమీ పట్టనట్లుగా ఉండే ఆయన పులి మాదిరి గర్జిస్తారు. వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కిస్తారు. ఏదో జరిగిపోతుందన్న భావన కలిగేలా చేస్తారు.

తాజాగా అలాంటి పరిస్థితినే మరోసారి తీసుకొచ్చారు కేసీఆర్. తెలంగాణలో తనకు తిరుగులేదన్న స్థాయి నుంచి.. తాను రంగంలోకి దిగకుండా మరేదో జరుగుతుందన్న భావనలోకి కేసీఆర్ వచ్చినట్లుగా ఆయన మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మోడీ మీద నిప్పులు చెరిగిన ఆయన.. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కామ్ అయిపోవటమే కాదు.. మోడీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై.. ఏమని స్పందించాలన్న షాక్ లో రాజకీయ అధినేతలంతా ఉన్న వేళలో.. అందరి కంటే ముందు స్పందించింది కేసీఆరే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

చివరకు కరోనా టైంలో.. కాంగ్రెస్ నేతలతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు ఆయనపై విరుచుకుపడి.. ఘాటైన విమర్శల్ని చేస్తే.. ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. మోడీకి మద్దతు పలకటమే కాదు.. ఇంటి బయటకు వచ్చి గంట కొట్టటం.. పళ్లెం మోగిస్తే ఏమైనా అవుతాది.. అంటూ ప్రధానమంత్రిపై విమర్శల్ని చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై అలాంటి మాటలు మాట్లాడతారా? సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అని కన్నెర్ర చేయటమే కాదు..అలా చేసే వారిపై కేసులునమోదు చేయాలని విలేకరుల సమావేశంలోనే రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేయటాన్ని చూసిన పరిస్థితి.

2014 ఎన్నికల వేళలో మోడీపై ఒంటికాలిపై లేచి విరుచుకుపడిన కేసీఆర్.. ఆ తర్వాత గమ్మున కావటం.. మళ్లీ ఇప్పుడు గొంతు సవరించుకొని తీవ్ర వ్యాఖ్యలు చేయటం చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ ఆయన్ను ఇబ్బంది పెడుతోంది. మరోవైపు రేవంత్ చేతికి టీ కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత.. రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోవటం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చచ్చిందన్న వ్యాఖ్య చేసిన కేసీఆర్.. తన మాటను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వేళలోనే జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసిన వైనం తెలిసిందే.

ఏది ఏమైనా ఈటలకు ఓటమి రుచి చూపిద్దామని భావించిన కేసీఆర్ కు బలమైన ఎదురుదెబ్బ తగలటం తెలిసిందే. ఆ చేదు అనుభవం నుంచి బయటకురావటానికి కాస్తంత టైం పట్టిందని చెప్పాలి. ఆ సందర్భంగా మొదలైన బీజేపీపై దాడి అంతకంతకూ ముదురుతూ వచ్చింది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీపై నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటమే కాదు..

దేశం నుంచి తరిమికొడతామన్న తీవ్రమైన వ్యాఖ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం సంచలనంగా మారింది. ఎప్పటికప్పుడు తన ప్రత్యర్థులపై తాత్కాలికంగా ఫైట్ చేసే ఆయన.. మోడీతో తాజాగా పెట్టుకున్న వైరం మాత్రం.. మిగిలిన వాటికి కాస్త భిన్నంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఆవేశం వచ్చినప్పుడు.. కోపం తన్నుకువచ్చిన మూడునాలుగు రోజులు నోటికి పని చెప్పే కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదంటున్నారు. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ తాజా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారి తీసే వీలుందన్న మాట వినిపిస్తోంది.