Begin typing your search above and press return to search.

రష్యాలో తొలి బర్డ్​ ఫ్లూ కేసు నమోదు..!

By:  Tupaki Desk   |   21 Feb 2021 4:10 AM GMT
రష్యాలో తొలి బర్డ్​ ఫ్లూ కేసు నమోదు..!
X
ఓ పక్క ఇంకా కరోనా కేసులు తగ్గనే లేదు.. కొత్త స్ట్రెయిన్​ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో ముప్పు ముంచుకొచ్చింది. పలుచోట్ల పక్షులకు బర్డ్​ ఫ్లూ సోకుతున్న విషయం తెలిసిందే. అయితే మనుషులకు కూడా బర్డ్ ​ఫ్లూ సోకింది. ఇప్పటికే రష్యాలో ఓ కేసును గుర్తించారు వైద్యులు. బర్డ్​ ఫ్లూకు కారణమయ్యే వైరస్​ ను మనుషుల్లో గుర్తించినట్టు రష్యాలోని వెక్టార్​ రీసెర్చ్​ సెంటర్​ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణంగా ఇన్‌ ఫ్లూయెంజా ఎ వైరస్‌ లోని H5N8 స్ట్రెయిన్‌ కారణంగా పక్షులకు బర్డ్ ​ఫ్లూ సోకుతుంది. అయితే రష్యాలోని ఓ వ్యక్తిలో వైద్యులు ఈ వైరస్​ ను గుర్తించారు.

మానవుల్లో తొలి బర్డ్​ ఫ్లూ కేసు ఇదేనని రష్యా శాస్త్రవేత్తలు అంటున్నారు. బర్డ్​ ఫ్లూ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వైరస్​ కారణంగా వేలసంఖ్యలో పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఇప్పటివరకు ఈ వైరస్​ మనుషుల్లో కనిపించలేదు. కానీ తొలిసారిగా మనుషుల్లోనూ ఈ వైరస్​ ను గుర్తించడం ఆందోళన కలిగిస్తున్న విషయమని డాక్టర్లు అంటున్నారు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబర్‌ లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. ఓ పౌల్ట్రీ ఫామ్‌ లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి క్లినికల్ లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే ఈ వైరస్​ ఇప్పటికైతే ప్రాణాంతకం కాదని డాక్టర్లు అంటున్నారు. అయితే భవిష్యత్​ లో ఈ వైరస్​ రూపాంతరం చెంది మరింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మనదేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్​ ఫ్లూ కలకలం సృష్టించింది. ప్రస్తుతం అయితే తీవ్రత తగ్గింది.