Begin typing your search above and press return to search.

మూవీ రిలీజ్ లతో పోలిస్తే మెట్రో అంతేన‌ట‌!

By:  Tupaki Desk   |   29 Nov 2017 9:52 AM GMT
మూవీ రిలీజ్ లతో పోలిస్తే మెట్రో అంతేన‌ట‌!
X
ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురుచూపులు చూసి.. సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర ప‌డే వేళ‌.. అతృత ఎలా ఉంటుంది? సినిమా బాష‌లో చెప్పాలంటే.. రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా రిలీజ్ వేళ‌.. ఎంత సంద‌డి ఉంటుందో అంత ఉంటుంద‌ని చెప్పాలి. లేదంటే.. టాలీవుడ్ అగ్ర‌హీరోల సినిమా రిలీజ్ సంద‌ర్భంగా థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఎంత సంద‌డి నెల‌కొంటుందో అంత ఉండాలి. ఇదంతా ఎందుకంటే.. ఏళ్ల‌కు ఏళ్లుగా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన రోజు రానే వ‌చ్చేసింది.

మెట్రో రైల్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేసింది. ఈ రోజు ఉద‌యం స‌రిగ్గా ఆరు గంట‌ల‌కు మియాపూర్‌.. నాగోల్ స్టేష‌న్ల ద‌గ్గ‌ర నుంచి మెట్రో రైళ్లు ప‌రుగులు తీశాయి. ఇంత‌కాలం ఒంటి స్తంభం అద్భుతంగా ఉంటూ.. సామాన్యుడికి అంద‌నంత దూరాన ఉన్న మెట్రోరైలు అందుబాటులోకి వ‌చ్చేసింది. మీడియాలో భారీ హైప్ నేప‌థ్యంలో మెట్రో రైల్ ఓపెనింగ్‌.. టాలీవుడ్ అగ్ర‌హీరో సినిమా రిలీజ్ నాటి హ‌డావుడి మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద క‌నిపిస్తుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది.

మ‌రి.. వాస్త‌వం ఎలా ఉంద‌న్న‌ది చూస్తే.. అంత సీన్ లేద‌ని చెప్పాలి. ప్ర‌ధాన‌మైన మియాపూర్‌.. నాగోల్‌.. అమీర్ పేట్ స్టేష‌న్ల‌లో ఉద‌యం బ‌య‌లుదేరి మొద‌టి ట్రైన్లో సీట్లు కూడా నిండని ప‌రిస్థితి.

పొద్దుపొద్దున్నే.. చ‌లి చంపుతున్న వేళ‌.. మెట్రో ఎక్క‌టానికి ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తి ఉంటుందా? అన్న సందేహానికి త‌గ్గ‌ట్లే మెట్రో స్టేష‌న్ల ద‌గ్గ‌ర సంద‌డి అంతంత మాత్రంగా ఉంది. స్టేష‌న్ల ద‌గ్గ‌ర ప్ర‌యాణికుల కంటే కూడా మీడియా హ‌డావుడి ఎక్కువ‌గా క‌నిపించింది.

ప్ర‌ధాన స్టేష‌న్ల‌ను వ‌దిలేసి.. మ‌ధ్య‌లోని స్టేషన్ల (బాలాన‌గ‌ర్‌.. ఈఎస్ఐ.. ఎన్‌జీఆర్ఐ.. స్టేడియం.. లాంటివి) లో అయితే వేళ్ల మీద లెక్క పెట్టేంత‌లా ప్ర‌యాణికులు స్టేష‌న్లో క‌నిపించారు. ఇవాల్టి నుంచి అందుబాటులోకి వ‌చ్చేసిందిగా.. ఇంకెక్క‌డికిపోతుంద‌న్న ధిలాసా కావొచ్చు.. స్టేష‌న్ల ద‌గ్గ‌ర హ‌డావుడి అంతంత‌మాత్రమేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మెట్రో రైలు ప్ర‌యాణంలో క‌నిపించిన రెండు ప్ర‌ధాన అంశాలు ఏమిటంటే.. ఒక‌టి టైం విష‌యంలో చాలా క‌లుసుబాటు క‌నిపిస్తుంది. క‌న్నుమూసి తెరిచేంత వ్య‌వ‌ధిలో స్టేష‌న్ వ‌చ్చేసిన ప‌రిస్థితి క‌నిపించింది. మియాపూర్ నుంచి బాలాన‌గ‌ర్ స్టేష‌న్‌కు మ‌హా అయితే ప‌ది నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ప‌ట్టింది. ప‌లు స్టేష‌న్ల మ‌ధ్య ప్ర‌యాణ వ్య‌వ‌ధి చాలా త‌క్కువ‌గా ఉండ‌టం క‌నిపించింది. ఇంకాస్త స్ప‌ష్టంగా చెప్పాలంటే.. మెట్రో రైలు ఎక్కి ఒక ఫోన్ కాల్ చేసి.. దాన్ని పూర్తి చేసే లోపే దిగాల్సిన స్టేష‌న్ (సుమారు ప‌ది స్టేష‌న్ల గమ్య‌స్థానం అయితే) వ‌చ్చేసే ప‌రిస్థితి ఇక‌.. రెండోది కీల‌క‌మైన అంశం.. ట్రైన్ టికెట్ల విష‌యంలో స‌గ‌టుజీవికి అసంతృప్తికి గురి కావ‌టం ఖాయం. ఎందుకంటే.. మ్యాగ్జిమం టికెట్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌క్కువ నిడివి ఉన్న స్టేష‌న్ల‌కు వ‌సూలు చేస్తున్న టికెట్ ఛార్జీలు మంట పుట్టేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే రీతిలో సాగితే.. సామాన్యులు మెట్రో స్టేష‌న్ ముఖాన్ని చూసే అవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తోంది. మెట్రో మీద క్రేజ్ ఉన్నా.. దాని కోసం పెట్టే ఖ‌ర్చు.. ఆస‌క్తిని చంపేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎంత ఇష్టం.. ఆస‌క్తి ఉంటే మాత్రం జేబులో డ‌బ్బుల్ని ఉత్త‌పుణ్యానికి ఎవ‌రు మాత్రం పోగొట్టుకుంటారు చెప్పండి?