Begin typing your search above and press return to search.

1008 జాబ్స్: హిజ్రాలకు ప్రత్యేక జాబ్ పోర్టల్!

By:  Tupaki Desk   |   20 April 2015 12:18 PM GMT
1008 జాబ్స్: హిజ్రాలకు ప్రత్యేక జాబ్ పోర్టల్!
X
సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 2014 న హిజ్రాలను థర్డ్‌‌జెండర్‌‌గా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేశింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలంతా ఆనందం వ్యక్తం చేశారు. ఏదేశంలో అయినా ఒక మనిషి... తనను కూడా మనిషిగా గుర్తించండి అని అర్ధించాడంటే... అక్కడ మానవత్వం ప్రశ్నార్ధకం అయ్యినట్లు లెక్క అని అభిప్రాయ పడిన మేధావులతో కోర్టు ఏకీభవించింది... ఫలితంగా థర్డ్‌‌జెండర్‌‌గా గుర్తించింది! ఈ క్రమంలో గుర్తింపు పొందిన హిజ్రాలు పూర్తిగా అందరిలాగానే బ్రతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వారి ప్రయత్నాలు ఎప్పుడూ వారు చేస్తూనే ఉన్నారు కానీ... సమాజం నుండి, చట్టాల నుండి, ప్రభుత్వాల నుండీ వారికి సరైన మద్ధతు దొరకలేదనే చెప్పాలి. ఈ క్రమంలో సుప్రీం తీర్పు తర్వాత సమాజంలో హిజ్రాలు అన్ని విషయాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. చదువుకోవడానికి స్కూల్లకు వెళ్తున్నారు, కాస్త చదువుకున్న వారు ఉద్యోగాలూ చేస్తున్నారు. వారికంటూ ప్రత్యేక సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. మేమూ మనుషులమే, దేవుడు చేసిన పొరపాటే తప్ప... మాకు మేముగా చేసిన నేరమేమీ లేదని గొంతెతున్నారు!
హిజ్రాలంటే పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ... 10, 20 బిక్షమెత్తడం కాదు... వారు కూడా వారి వారి అర్హతల మేర ఉద్యోగాలు చేసుకోవాలని భావించింది ఒక సంస్థ. అనుకున్నదే తడవుగా హిజ్రాలకోసం ఒక జాబ్ పోర్టల్ ను ప్రారంభించారు. 1008jobs.com పేరిట వ్యాల్యూవింగ్స్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా ఈ వెబ్ సైట్ ని లాంచ్ చేసింది. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న హిజ్రాల తమ తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగావసరాలను తీర్చడానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగం సాధించినవారికి వ్యాల్యూవింగ్స్ నుంచి జాయినింగ్ బోనస్ కూడా లభించనుంది. ఈ సైట్ ఉద్యోగావకాశాలను కల్పించడమే కాకుండా ప్రతి నగరంలోనూ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న హిజ్రాలకు సాయపడే ఏజంట్లను కూడా నియమించనుంది.