Begin typing your search above and press return to search.

దేశంలో తొలి మంకీ పాక్స్ మ‌ర‌ణం ఇక్క‌డే!

By:  Tupaki Desk   |   1 Aug 2022 5:34 AM GMT
దేశంలో తొలి మంకీ పాక్స్ మ‌ర‌ణం ఇక్క‌డే!
X
ప్రపంచ దేశాల‌ను బెంబేలెత్తిస్తోన్న మంకీ పాక్స్ కు సంబంధించి భార‌త్ తో తొలి మ‌ర‌ణం కేర‌ళ రాష్ట్రంలో న‌మోద‌వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే మంకీ పాక్స్ ఇప్ప‌టివ‌ర‌కు 78 దేశాల్లో వ్యాపించింది. మొత్తం 18 వేల‌ మందికి పైగా దీని బారిన‌పడ్డారు. ఆఫ్రికా దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ ఆచిర కాలంలోనే ప్ర‌పంచ దేశాల‌కు పాకింది. భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు కేసులు న‌మోద‌వ్వ‌గా.. భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు కేసులు కేరళలో, ఒకటి ఢిల్లీలో నమోదైంది.

కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చావక్కాడ్ కురంజియూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌ వైరస్‌తో మరణించాడు. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మృతిపై ఉన్న‌త స్థాయి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని ఆమె చెబుతున్నారు. మృతి చెందిన యువ‌కుడు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి జూలై 22న ఇండియాకు వ‌చ్చాడు. ఇండియాకు వ‌చ్చే ముందు ప‌రీక్ష‌లు చేయ‌గా అత‌డికి మంకీ పాక్స్ నిర్ధార‌ణ అయ్యింది.

మంకీ పాక్స్ తో మృత్యువాత ప‌డ్డ కేర‌ళ‌ యువకుడు భారత్‌కు వచ్చిన తర్వాత తీవ్రమైన అలసట, మెదడువాపుతో త్రిసూర్‌లో చికిత్స పొందాడు. అయితే అత‌డు మంకీపాక్స్ త‌న‌కు సోకిన‌ట్టు తెలిసినా బ‌య‌ట తిరిగాడు.

చికిత్స తీసుకోకుండా కొద్ది రోజులు ఇలాగే బ‌య‌ట తిరిగాడ‌ని కేర‌ళ వైద్య శాఖ మంత్రి చెబుతున్నారు. దీంతో అత‌డికి జూలై 26న తీవ్రమైన జ్వరం వ‌చ్చింది. అప్పుడు కానీ అత‌డు ఆస్ప‌త్రిలో చేర‌లేదు.

వాస్త‌వానికి మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కేర‌ళ యువ‌కుడు చికిత్స తీసుకోవడంలో ఆల‌స్యం చేశాడు. కాగా మరణించిన యువకుడు ఇండియాకు వ‌చ్చాక ఎవ‌రెవ‌రిని క‌లిశాడు? ఎక్క‌డెక్క‌డ తిరిగాడు? వంటి వివ‌రాల‌ను కేర‌ళ ప్ర‌భుత్వం సేక‌రిస్తోంది. ఈ మేర‌కు అత‌డి కాంటాక్ట్ లిస్ట్‌, రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. కేర‌ళ యువ‌కుడిని క‌లిసిన కాంటాక్ట్ వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కేర‌ళ ప్ర‌భుత్వం సూచించింది.

కాగా.. మంకీపాక్స్‌పై కేంద్ర ప్ర‌భుత్వం కూడా అప్రమత్తమైంది. కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని.. కేంద్రం కూడా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని స్ప‌ష్టం చేసింది.