Begin typing your search above and press return to search.

షాకింగ్ : ప్లాస్మా థెరపీ చేసిన తోలి కరోనా పేషెంట్ మృతి !

By:  Tupaki Desk   |   1 May 2020 4:20 PM IST
షాకింగ్ : ప్లాస్మా థెరపీ చేసిన తోలి కరోనా పేషెంట్ మృతి !
X
కరోనా మహమ్మారి ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. ఈ కరోనా మహమ్మారికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోజుకి దీని విజృంభణ పెరిగిపోతుంది. ఈ సమయంలో వెలుగులోకి వచ్చిందే ప్లాస్మా థెరపీ. ఈ థెరపీ ద్వారా కరోనాకు చికిత్స చేయవచ్చని పలువురు చెబుతున్నారు. అయితే అది కొన్ని చోట్ల సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ.. మరికొన్ని చోట్ల ఇవ్వడం లేదు. కేంద్రం కూడా ఇప్పటికే ప్లాస్మా థెర‌పీని స‌రైన ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించ‌క‌పోతే.. ప్రాణాల‌కే ముప్పు స్పష్టంగా తెలియజేసింది.

ఈ నేపథ్యంలో, ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృత్యువాత పడ్డ ఘటన ముంబైలో జరిగింది. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన తొలి మహారాష్ట్ర వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. ఆ వ్యక్తి సెప్టిసిమియాతో పాటు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాడని.. ప్లాస్మా థెరపీ చేయించిన తరువాత కాస్త కోలుకున్నాడని అక్కడి డాక్టర్లు తెలిపారు.

కాగా ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇటీవల పేర్కొన్నారు. కరోనా నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని.. దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని, దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దని ఆయన వెల్లడించారు.పేషెంట్‌ కు ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని లవ్ అగర్వాల్ హెచ్చరించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీకి సిద్దమౌతున్న తరుణంలో తోలి మరణం సంభవించడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.