Begin typing your search above and press return to search.

ఏపీలో తొలి పాజిటివ్ కేసు ... నెల్లూరు యువకుడికి సోకిన కరోనా

By:  Tupaki Desk   |   12 March 2020 11:46 AM GMT
ఏపీలో తొలి పాజిటివ్ కేసు ... నెల్లూరు యువకుడికి సోకిన కరోనా
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీకి కూడా పాకింది. ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నెల్లూరుకు చెందిన యువకుడి బ్లడ్ శాంపిల్స్‌ ని తిరుపతి ల్యాబ్‌ లో పరీక్షించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఆ యువకుడు ఈ మద్యే ఇటలీ నుండి వచ్చినట్టు గుర్తించారు. దీనితో వారి కుటుంబ సభ్యులకి కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేయనున్నారు. అలాగే వారిని కూడా 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనాకి చికిత్స చేయనున్నారు.

నెల్లూరు నగరంలోని చిన్నబజార్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇటలీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ మద్యే ఆ యువకుడు ఇటలీ నుండి నెల్లూరుకి తిరిగివచ్చాడు. ఇటలీ నుండి వచ్చినప్పటినుండి అతడికి దగ్గు, గొంతు నొప్పి ఉండడంతో ఆస్పత్రి కి వెళ్లాడు. అయితే చైనా తర్వాత ఇటలీలోనే ఎక్కువ కరోనా మరణాలు నమోదవడంతో.. అనుమానించిన డాక్టర్లు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక పరీక్షలు చేయగా కరోనా సోకినట్టు అనుమానం రావడంతో అతడి శాంపిళ్లను తిరుపతికి పంపారు. అక్కడ ఆ యువకుడికి కరోనా వచ్చినట్టు నిర్దారించారు. గత 14 రోజులుగా ఆ యువకుడు ప్రభుత్వ హస్పిటల్‌ లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడు కలిసిన వారిని కూడా హాస్పిటల్లో క్వారంటైన్‌ లో ఉంచారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,638 మంది చనిపోయారు. మరో లక్షా 26వేల మంది ఈ వైరస్ సోకడం తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటి వరకూ ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 73 కి చేరింది. వీరిలో 56 మంది భారతీయులు కాగా.. 17 మంది విదేశీయులు ఉన్నారు.