Begin typing your search above and press return to search.

దేశంలో తొలి ప్రైవేటు ట్రైన్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళుతుందంటే?

By:  Tupaki Desk   |   15 Jun 2022 7:30 AM GMT
దేశంలో తొలి ప్రైవేటు ట్రైన్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళుతుందంటే?
X
పెద్ద ఎత్తున చర్చలు.. వాదోపవాదాలు జరిగిన ప్రైవేటు రైలు బండి ఎట్టకేలకు పట్టాల మీదకు ఎక్కింది. దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసు మొదలైంది. ప్రస్తుతం ప్రయాణంలో ఉన్న ఈ రైలు తన గమ్యస్థానానికి గురువారం ఉదయానికి చేరుకోనుంది. మొత్తం 20 బోగీలున్న ఈ రైలుకు 'భారత్ గౌరవ్' పేరు పెట్టారు. ప్రైవేటు రైళ్లు మొత్తానికి ఇదే పేరుతో వ్యవహరించనున్నారు.

దేశంలో వివిధ రైల్వే రీజియన్లు ఉన్నప్పటికీ తొలి ప్రైవేటు రైలు సర్వీసును స్టార్ట్ చేసిన ఘనత మాత్రం దక్షిణ మధ్య రైల్వేకు దక్కింది. తొలి ప్రైవేటు రైలు బండిని తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి బయలుదేరింది.

ఇది మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్ కు గురువారం ఉదయం చేరుకోనుంది. కోయంబత్తూరులో సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరే ఈ రైలులో పదకొండు వందల మంది ప్రయాణించే వీలుంది. ఈ రైలు గురువారం ఉదయం 7.25 గంటలకు షిర్డీ చేరుకోనుంది.

తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ లో బయలుదేరిన ఈ రైలు తిరుప్పూరు, ఈరోడ్‌, సేలం, యెలహంక, ధర్మవరం, మంత్రాలయం స్టేషన్లలో ఆగనుంది.

షిర్డీ చేరిన తర్వాత ప్రయాణికులకు అవసరమైన బస్సు సదుపాయంతో పాటు సాయిబాబా దర్శన ఏర్పాట్లు కూడా కల్పిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మంత్రాలయంలో ఆగుతుంది.

ఈ స్టేషన్ లో దాదాపు ఐదు గంటల పాటు ఆగి.. ప్రయాణికులకు స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చే వెసులుబాటు ఈ రైలులో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.